పల్లెలు దయనీయం.. పట్టణాల్లో నరకం

సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్న మున్సిపల్ శాఖలోనే ఈస్థాయిలో నిధుల కొరత ఉంటే.. ఇక ఇతర శాఖల దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు కేటీఆర్.

Advertisement
Update:2024-08-14 14:26 IST

బీఆర్ఎస్ హయాంలో పదేళ్లు పచ్చగా కళకళలాడిన పల్లెలు, ప్రగతిపథంలో దూసుకుపోయిన పట్టణాలు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ అసమర్థతకు, పాలనా వైఫల్యానికి పల్లెలు, పట్టణాల్లోని పరిస్థితులే నిలువెత్తు నిదర్శనం అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందని అన్నారు కేటీఆర్.


కాంగ్రెస్ పాలనలో.. పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయంటూ ఘాటు ట్వీట్ వేశారు కేటీఆర్. తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసిందని, పట్టణాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారిందని చెప్పారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. గతంలో చేసిన కాంట్రాక్ట్ పనులకు 8 నెలలైనా బిల్లులు రాకపోవడంతో తాజా మాజీ సర్పంచ్ లు అప్పుల్లో కూరుకుపోయారని చెప్పారు. పారిశుధ్యం, డ్రైనేజీ నిర్వహణ అధ్వాన్నంగా మారడంతో డెంగ్యూ, మలేరియా విజృంభిస్తున్నాయని చెప్పారు కేటీఆర్.

ప్రజాపాలన అంటే ఇదేనా అని నిలదీశారు కేటీఆర్. బీఆర్ఎస్ పాలనలో ప్రతి నెలా పంచాయతీలకు రూ.275 కోట్లు విడుదల చేశామని గుర్తు చేశారాయన. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగినందుకు 1800 మంది మాజీ సర్పంచ్ లను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. దేశానికే పట్టుగొమ్మలుగా భావించే పల్లెలపై కాంగ్రెస్ ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు కేటీఆర్. సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్న మున్సిపల్ శాఖలోనే ఈస్థాయిలో నిధుల కొరత ఉంటే.. ఇక ఇతర శాఖల దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. మున్సిపాలిటీల్లో దెబ్బతిన్న రోడ్లు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీల మరమ్మత్తులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 

Tags:    
Advertisement

Similar News