ఉచితానికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు
ఇక్కడ ఆర్టీసీకి నష్టం లేదు, ఉచితం పేరుతో జనాలకు ఒరిగేదేమీ లేదు. త్వరలో తెలంగాణలో కూడా ఇదే పద్ధతి అమలులోకి వస్తుందని హెచ్చరించారు కేటీఆర్.
ఉచితం అంటే ఏంటి..?
ఉచితంగా వచ్చేవాటికి ఆశపడితే పర్యవసానాలు ఏంటి..?
ఇప్పుడు ఉచితం అంటారు సరే, రేపటి సంగతేంటి..?
ఒక్క ట్వీట్ తో ఈ ఉచితాలపై ప్రజలకు ఉన్న భ్రమలు తొలగించే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉచితాలకు మోసపోతే రేపు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. దీనికి ఉదాహరణగా కర్నాటకలో ఆర్టీసీ బస్ చార్జీల పెంపుని ప్రస్తావించారు.
ప్రస్తుతం కర్నాటకలో మహిళలకు ఉచిత రవాణా పథకం అమలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఈ ఉచిత ప్రయాణం వల్ల ఏటా రాష్ట్ర ప్రభుత్వంపై 295కోట్ల రూపాయల భారం పడుతోంది. ఈ భారాన్ని తగ్గించుకోడానికి ప్రభుత్వం మరో ఎత్తుగడ వేసింది. ఆర్టీసీ చార్జీలు పెంచే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అంటే మహిళల ఉచిత ప్రయాణానికి పురుషులపై వడ్డింపు అన్నమాట. ఒకరకంగా భార్య ఉచిత ప్రయాణం కోసం భర్త ఆమెతో కలసి బస్సు ఎక్కితే.. పెరిగిన టికెట్ రేటుతో జేబుకి చిల్లుపడుతుంది. అంటే ఇక్కడ ఆర్టీసీకి నష్టం లేదు, ఉచితం పేరుతో జనాలకు ఒరిగేదేమీ లేదు. త్వరలో తెలంగాణలో కూడా ఇదే పద్ధతి అమలులోకి వస్తుందని హెచ్చరించారు కేటీఆర్.
కర్నాటకలో ఉచిత హామీ సక్సెస్ అవడం వల్లే తెలంగాణలో కూడా మహిళల ఉచిత రవాణా హామీ ఇచ్చింది కాంగ్రెస్. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీ అమలులో పెట్టింది. అయితే ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిల విషయంలో మాత్రం ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఆర్టీసీ చార్జీలు పెంచితే మాత్రం ప్రభుత్వం బకాయిలు సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉండదు. పెంచిన చార్జీల రూపంలో మహిళల ఉచిత భారాన్ని పురుషుల వద్ద రికవరీ చేసుకోవచ్చు. తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితే వస్తుందని అంటున్నారు కేటీఆర్. ఉచిత ప్రయాణం అనే హామీతో చివరకు ప్రజలపైనే ప్రభుత్వం భారం వేస్తోందని ఆయన విమర్శించారు.