'చలో ఢిల్లీ' కాదు.. దమ్ముంటే 'చలో పల్లె' చేపట్టు

అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో ఏకంగా 20సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రదక్షిణలు చేశారన్నారు కేటీఆర్. రిమోట్ కంట్రోల్ పాలనతో ఆయన రైతులను బలిచేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement
Update:2024-08-23 14:26 IST

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో ఏకంగా 20సార్లు ఆయన ఢిల్లీ ప్రదక్షిణలు చేశారన్నారు. రిమోట్ కంట్రోల్ పాలనతో ఆయన రైతులను బలిచేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే 'చలో ఢిల్లీ' కాకుండా, 'చలో పల్లె' అనే కార్యక్రమం చేపట్టాలని సూచించారు కేటీఆర్.


తెలంగాణలో రుణమాఫీ కాక లక్షలాది రైతులు రగిలిపోతున్నారని, వారివైపు సీఎం కన్నెత్తి కూడా చూడకుండా హస్తిన యాత్రకు వెళ్లారని ఎద్దేవా చేశారు కేటీఆర్. ఎన్నికలప్పుడు అన్నీ గాలి మాటలు చెప్పి, గద్దెనెక్కగానే గాలిమోటార్లలో ఊరేగుతున్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అసలు ఆయన ఢిల్లీ యాత్రల వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగిన ప్రయోజనమేంటని సూటిగా ప్రశ్నించారు. అన్నదాతలను ఆగంచేసి, దేశ రాజధాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే.. రైతుల తండ్లాట తీర్చేదెవరు..? రుణమాఫీ పూర్తిచేసెదెవరు..? అని అడిగారు కేటీఆర్.

తెలంగాణ రాష్ట్రంలో ఓవైపు డెంగీ మరణాలు, మరోవైపు నేరాలు పెరుగుతున్నాయని, ఇంకోవైపు అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయని చెప్పారు కేటీఆర్. గాడితప్పిన పాలనతో రాష్ట్రమంతా అట్టుడుకుతున్న ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో.. ముఖ్యమంత్రి, మంత్రులు ఉండాల్సింది ఢిల్లీలో కాదని, తెలంగాణ గల్లీల్లో అని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని గాలికొదిలేసి, హైకమాండ్ ఆశీస్సుల కోసం పాకులాడితే.. తెలంగాణ సమాజమే ఏదో ఒకరోజు సీఎం కుర్చీ లాగేయడం తథ్యమని చెప్పారు కేటీఆర్.

Tags:    
Advertisement

Similar News