8నెలల్లో 36 మంది పిల్లలు చనిపోయారు.. కాస్త పట్టించుకోండి

పెద్దాపూర్ గురుకులంలో పాముకాటుకి గురై చనిపోయిన విద్యార్థి కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. బీఆర్ఎస్ తరపున వారికి ఆర్థిక సాయం చేశారు.

Advertisement
Update:2024-08-12 16:38 IST

తెలంగాణలోని ప్రభుత్వ హాస్టళ్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. భేషజాలు పక్కనపెట్టి ముందు పని మొదలు పెట్టాలన్నారు. పెద్దాపూర్ గురుకులంలో పాముకాటుకి గురై చనిపోయిన విద్యార్థి కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. బీఆర్ఎస్ తరపున వారికి ఆర్థిక సాయం చేశారు.


తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 8 నెలలలో 36మంది పిల్లలు గురుకులాల్లో చనిపోయారని గుర్తు చేశారు కేటీఆర్. వారంతా వివిధ కారణాలతో మరణించారని, ఆ మరణాలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని, ఇకపై అలాంటి దారుణాలు జరగకుంటా అడ్డుకట్ట వేయాలని కోరారు. భువనగిరి, సూర్యాపేటలో ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయని, మరికొన్ని చోట్ల పాముకాట్లు, కల్తీ ఆహారం వల్ల కూడా మరణాలు సంభవించాయన్నారు. కల్తీ ఆహారం తిని 500మంది పిల్లలు ఆస్పత్రిపాలయ్యారని చెప్పారు. ఆయా కుటుంబాలకు ప్రభుత్వం తరపున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు కేటీఆర్. వారికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు.

హాస్టల్ మరణాలపై బీఆర్ఎస్ తరపున కూడా ఓ కార్యాచరణ చేపడుతున్నట్టు తెలిపారు కేటీఆర్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో హాస్టళ్లలోని పరిస్థితులను అధ్యయనం చేయిస్తామన్నారు. సమస్యలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఇది రాజకీయం కోసం చేస్తున్నది కాదని, హాస్టల్ లో పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులకు కడుపుకోత ఉండకూడదనే ఉద్దేశంతో ఈ పని మొదలు పెడుతున్నట్టు చెప్పారు కేటీఆర్. 

Tags:    
Advertisement

Similar News