కాంగ్రెస్ లో సీఎంలు ఉన్నారు కానీ, ఆ పార్టీకి ఓటర్లే లేరు..
కేసీఆర్ సింహం లాంటి వారని, సింగిల్ గానే వస్తారని చెప్పారు కేటీఆర్. తెలంగాణ సీఎం ఎవరు అనేది ప్రజలు నిర్ణయించాలని.. మోదీ, రాహుల్ కాదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో కుర్చీలాటపై మరోసారి సెటైర్లు పేల్చారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ కి సీఎంలు దొరికారు కానీ, ఓటర్లు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. 11మంది సీఎం అభ్యర్థుల లిస్ట్ తేలిందన్నారు. చివరకు ఎన్నికల్లో పోటీ చేయని జానారెడ్డి కూడా సీఎం పదవి కావాలని కలలు కంటున్నారని, ఎంతమందికి సీఎం కుర్చీ కావాలని కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్త కాదని, గతంలో నెహ్రూ, ఇందిరతోనూ కొట్లాడారని. ఇంతకు ముందు సోనియా, ఇప్పుడు మోదీతో కొట్లాడుతున్నామని చెప్పారు.
న్యాయవాదులకు వరాలు..
జలవిహార్ లో జరిగిన న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. మూడోసారి అధికారంలోకి వస్తే లాయర్ల సంక్షేమానికి ఏమేం చేయబోతున్నామనే విషయాన్ని వివరించారు. అడ్వొకేట్ ట్రస్ట్ ను రూ.500 కోట్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. న్యాయవాదులకు వైద్య బీమాను కూడా పెంచుతామని ప్రకటించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో న్యాయవాదుల సేవలను కొనియాడారు. విద్యార్థులతో సమానంగా న్యాయవాదులు పోరాడారని కితాబిచ్చారు కేటీఆర్.
కేసిఆర్ సింహం.. సింగిల్ గానే వస్తారు..
కేసీఆర్ మళ్లీ గెలవకపోతే పెరుగుతున్న హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుందని చెప్పారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ ను ఓడించడానికి అందరూ ఏకమవుతున్నారని.. కానీ కేసీఆర్ సింహం లాంటి వారని, సింగిల్ గానే వస్తారని చెప్పారు. తెలంగాణ సీఎం ఎవరు అనేది ప్రజలు నిర్ణయించాలని.. మోదీ, రాహుల్ కాదని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల పోరాటం ఢిల్లీ దొరలకు.. తెలంగాణ ప్రజలకు మధ్య అని వివరించారు కేటీఆర్.
♦