ప్రజల్ని, పార్లమెంటును మోసం చేసిన రేవంత్
మూసీ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు దాచిపెడుతున్నదని హరీశ్‌రావు ఫైర్
మూసీ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు దాచిపెడుతున్నదని, పార్లమెంటును రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం, పార్లమెంటుకు ఒకటి చెప్పి మరొకటి అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలుచేస్తున్నట్లు పార్లమెంటుకు చెప్పారు. దేశంలో ఏ ప్రాజెక్టులోనైనా నిర్వాసితులను ఆదుకోవాలని 2013 చట్టం వచ్చిందన్నారు. మెరుగైన చట్టం అమలు చేస్తే ఆయా రాష్ట్రాలు సొంతంగా చట్టాలు తెచ్చుకునే వెసులుబాటు ఇచ్చారు. అందుకే బీఆర్‌ఎస్ హయాంలో మరింత మెరుగ్గా 2014 భూసేకరణ చ్టటాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. 2014 భూసేకరణ చట్టం ఈ రోజుకూ రాష్ట్రంలో అమల్లో ఉందన్నారు. ఎన్యుమరేషన్ తర్వాత 60 రోజుల గడువు ఇచ్చి ప్రధాన పత్రికల్లో డిటైల్డ్‌గా నోటిఫికేషన్ ఇవ్వాలి. నిర్వాసితుల అభ్యంతరాలను భూసేకరణ అధికారి పరిగణనలోకి తీసుకోవాలి. అభ్యంతర పరిగణనలోకి తీసుకుని మరో 30 రోజుల గడువు ఇస్తూ పీడీ నోటిఫికేషన్ ఇవ్వాలి. నిర్వాసితుల అభ్యంతరాలను నివృత్తి చేసిన అనంతరమే ప్రక్రియ మొదలుపెట్టాలన్నారు. కానీ ప్రస్తుత ఎన్యుమరేషన్ జరగలేదని, పీడీ నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం డిపీఆర్ లేదన్నారు. లబ్దిదారులను గుర్తించలేదన్నారు.
2014 భూసేకరణ చట్టం ప్రకారం ఒక కుటుంబంలో పెళ్లి అయిన వారు ఎంత మంది ఉంటే వారందరినీ కుటుంబాలుగా గుర్తించాలి. మా హయాంలో మల్లన్నసాగర్, పాలమూరు ఎత్తిపోతల పథకం, సీతా రామ ప్రాజెక్టు ఇలా అన్నింటిలోనూ ఆ చట్టాన్ని అమలు చేశామన్నారు. వారికి నష్టపరిహారంతోపాటు ఉపాధి కోల్పోతున్నవారికి వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేశామన్నారు. అలాగే నిర్వాసితులకు కేటాయించిన ఇళ్లను వారిపేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయించామన్నారు. కానీ మూసీ నిర్వాసితుల విషయంలో రేవంత్ ప్రభుత్వం అటు 2013 భూసేకరణ చట్టం, ఇటు 2014 భూసేకరణ చట్టాన్ని అమలు చేయలేదు. ఇళ్లు కూల్చివేసి బాధితులందరినీ కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్‌రూమ్‌కు తరలించారు. వారికి ఎలాంటి రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వలేదన్నారు. ఒక ఉత్త కాగితం వాళ్ల చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నదన్నారు. మూసీ ప్రాజెక్టుపై అన్ని విషయాలు దాచి సీఎంరేవంత్ రెడ్డి ప్రజల్ని, పార్లమెంటును మోసం చేశారని హరీశ్‌రావు మండిపడ్డారు.