ఆమె చదువుకోసం కేటీఆర్ ఆర్థిక సాయం
ఆమె బాధ విని లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు కేటీఆర్. బంజారా హిల్స్ లో ఉన్న తన ఇంటికి పిలిపించి చెక్కుని అందించారు. ఆర్థిక సాయంతో ఆమె సంతోషంగా ఇల్లెందు బయలుదేరి వెళ్లారు.
ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన ఓ విద్యార్థిని చదువు కోసం మాజీ మంత్రి కేటీఆర్ లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఆమె చదువుకి ఆసరాగా నిలిచారు. ఈ సాయాన్ని ఆ విద్యార్థిని తల్లి అన్నపూర్ణకు తానే స్వయంగా అందించారు కేటీఆర్. కేటీఆర్ కు అన్నపూర్ణ ధన్యవాదాలు తెలిపారు. తన కుమార్తె చదువుకు అండగా నిలబడినందుకు ఆయనకు రుణపడి ఉంటామన్నారు.
ఇల్లెందు పట్టణం ఆజాద్ నగర్ కు చెందిన అన్నపూర్ణ ఆర్థిక స్థోమత లేక తన కుమార్తె చదువు కోసం ఇబ్బందులు పడుతున్నారు. నర్సింగ్ చదివేందుకు ఆ అమ్మాయికి ఆసక్తి ఉన్నా కుటుంబ పేదరికం కారణంగా తల్లి వారించింది. అయితే కూతురికి చదువుపై ఉన్న ఆసక్తిని చూసి ఆమె చలించిపోయింది. చివరి ప్రయత్నంగా హైదరాబాద్ బాటపట్టింది. కేసీఆర్, కేటీఆర్ ను కలిసి తన కష్టాలు చెప్పుకుందామని తెలంగాణ భవన్ కు వచ్చింది. అన్నపూర్ణ సమస్యలు తెలుసుకున్న కేటీఆర్.. ఆమె కుమార్తె చదువు కోసం వ్యక్తిగతంగా రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు.
ప్రజా దర్బార్ టు తెలంగాణ భవన్..
వాస్తవానికి అన్నపూర్ణ ప్రజా దర్బార్ లో తన ఆర్థిక సమస్యలు చెప్పుకోడానికి హైదరాబాద్ వచ్చారని తెలుస్తోంది. ప్రజా దర్బార్ లో 4 సార్లు దరఖాస్తు ఇచ్చినా ఫలితం లేదని ఆమె అంటోంది. అసెంబ్లీ వద్దకు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు రోజంతా కాపలా కాస్తే పోలీసులు పొమ్మన్నారని తెలిపింది. చివరిగా తెలంగాణ భవన్ కు వెళ్తే పరిష్కారం దొరుకుతుందని ఎవరో సలహా ఇచ్చారని, అందుకే తాను అక్కడకు వచ్చానని చెబుతోంది అననపూర్ణ. ఆమె బాధ విని లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు కేటీఆర్. బంజారా హిల్స్ లో ఉన్న తన ఇంటికి పిలిపించి చెక్కుని అందించారు. ఆర్థిక సాయంతో ఆమె సంతోషంగా ఇల్లెందు బయలుదేరి వెళ్లారు.