వాళ్లది పొలిటికల్ సూసైడ్.. కేటీఆర్ హాట్ కామెంట్స్
ఓ వైపు రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకుని రాజ్యాంగ రక్షకుడిగా ఫోజులు కొడుతున్నాడని, అదే కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణలో రాజ్యాంగ భక్షకులుగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
కేసులు, దాడులతో బెదిరించి ఎమ్మెల్యేలను లొంగదీసుకునే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తమకు సానుభూతి ఉందన్నారు. రాజకీయంగా వాళ్లంతా ఆత్మహత్య చేసుకున్నారని, వాళ్లను ప్రజలే శిక్షిస్తారన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే విషయంలో స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు, ప్రోటోకాల్ ఉల్లంఘన అంశాలపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. గతంలో పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన పరిణామాలను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని గతంలోనే స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని, ఇవాళ మరో 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్లు ఇచ్చామన్నారు.
ఓ వైపు రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకుని రాజ్యాంగ రక్షకుడిగా ఫోజులు కొడుతున్నాడని, అదే కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణలో రాజ్యాంగ భక్షకులుగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా కఠిన చట్టం తీసుకువస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని సైతం స్పీకర్‌కు గుర్తు చేశామన్నారు కేటీఆర్. ఇక హర్యాణాలో ఎమ్మెల్యే కిరణ్ చౌదరి బీజేపీలో చేరినందుకు అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పోరాడుతోందని కేటీఆర్ చెప్పారు.
ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌తో స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. ఫిరాయింపులకు తాను వ్యతిరేకమని చెప్పారని, ఆ ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు కేటీఆర్. ఇక ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సంచలన విషయాలు బయటపెట్టారు. ప్రాణగండం ఉందని డీఎస్పీలు ఫోన్ చేసి బెదిరిస్తే ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారారని చెప్పారు కేటీఆర్.