కొత్త రేషన్‌కార్డులపై వారంలోపే కీలక నిర్ణయం
సంక్రాంతి తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు అధికారవర్గాల స్పష్టత
కొత్త రేషన్ కార్డుల కోసం నగరవాసుల ఎదురుచూపులకు తెరపడనున్నది. సంక్రాంతి తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు అధికారవర్గాలు స్పష్టతనివ్వడంతో ఆశావహులు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమౌతున్నారు. నగరం నుంచి కొత్తగా సుమారు లక్ష దరఖాస్తులు వస్తాయని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా పరిధిలో 6,39, 506 రేషన్ కార్డులు ఉండగా 15 నుంచి 20 శాతం పెరుగుదల ఉంటుందని పౌర సరఫరాల శాఖ అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ పరిధిలో ప్రస్తుతం 653 చౌకధరల దుకాణాలుండగా వీటిలో 66 డీలర్ల స్థానాలు ఖాళీగా ఉండగా.. ప్రస్తుతం 587 చౌకధరల దుఖానాల ద్వారా రేషన్ సరఫరా అవుతున్నది. ప్రభుత్వం అర్హతలను నిర్దేశించి అవకాశం కల్పించినప్పుడు కొత్త వాటి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు. ఈ విషయమై కొత్త రేషన్‌కార్డులకు సంబంధించి వారంలోపే కీలక నిర్ణయం ఉంటుందని పేర్కొంటున్నారు.