కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు కాళేశ్వరం ఇసుక కాసుల పంట

అన్నారం బ్యారేజీ నుంచి ఇష్టారాజ్యంగా ఇసుక తరలింపు.. బ్యారేజీకి పొంచి ఉన్న ప్రమాదం

Advertisement
Update:2025-01-04 15:40 IST

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు కాళేశ్వరం ఇసుక కాసుల పంట పండిస్తోంది. అన్నారం బ్యారేజీ నుంచి వందలాది లారీల్లో ప్రతినిత్యం ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే బ్యారేజీ సమీపం నుంచి భారీ హిటాచీ మిషన్లతో ఇసుక తవ్వి తీస్తున్నారు. దీంతో అన్నారం బ్యారేజీ ఫౌండేషన్‌ దెబ్బతినే ప్రమాదముందని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే ఈ ఇసుక దందాకు మాస్టర్‌ మైండ్‌ గా వ్యవహరిస్తుండగా పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, వారి ముఖ్య అనుచరులు పాత్రదారులుగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరదలకు గోదావరిలో వేసిన ఇసుక మేటలు మాత్రమే రీచ్‌ల ద్వారా తొలగించాల్సి ఉంటుంది. అది బ్యారేజీలకు నిర్దేశిత దూరం నుంచే తీసుకోవాలి. బ్యారేజీ ఫౌండేషన్‌ కు ప్రమాదం వాటిల్లేలా ఇసుక తొలగించకూడదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో రెండో బ్యారేజీ అయిన అన్నారం బ్యారేజీకి అత్యంత దగ్గరి నుంచి ఇసుక తవ్వుతున్నారు. ఇసుక తవ్వడంలో నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదు.

కాళేశ్వరం బ్యారేజీల్లో ఒక్క మేడిగడ్డ బ్యారేజీలో పేరుకుపోయిన ఇసుకను తొలగించడానికి మాత్రమే టీజీఎండీసీ (తెలంగాణ మినరల్‌ డెవపల్‌మెంట్‌ కార్పొరేషన్‌) టెండర్ల ప్రక్రియ నిర్వహించింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద నుంచి ఇసుక తీసేందుకు టెండర్లు ఆహ్వానించలేదు. అయినా అన్నారం బ్యారేజీ అప్‌ స్ట్రీమ్‌ (ఎగువ), డౌన్‌ స్ట్రీమ్‌ (దిగువ) నుంచి ఇష్టారాజ్యంగా ఇసుక తీసి వందలాది లారీల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. బ్యారేజీకి అత్యంత సమీపం నుంచి ఇసుక తొలగిస్తుండటంతో మేడిగడ్డ బ్యారేజీ తరహాలోనే అన్నారం బ్యారేజీకి ప్రమాదం పొంచి ఉందని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి రివర్‌ బెడ్‌ లో నిర్దేశిత ప్రమాణాలకు ఉండాల్సిన ఇసుక అలాగే ఉంచి ఆపైన పేరుకుపోయిన ఇసుకను మాత్రమే తీయాల్సి ఉన్నా భారీ హిటాచీ మిషన్లు, పొక్లెయిన్లతో నదిగర్భంలోని ఇసుకను కూడా తొలగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇసుక తరలించే లారీల కోసం అన్నారం బ్యారేజీలో, బ్యారేజీ దిగువన ఏకంగా రోడ్డు వేసి రాత్రింబవళ్లు ఇసుకను తరలిస్తున్నారంటే దందా ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. రివర్‌ బెడ్‌ లోని ఇసుకను తోడేస్తుండటంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయని, గోదావరికి ఇరువైపులా ఉన్న బావులు, బోర్లలో నీళ్లు అడుగంటుతున్నాయని సమీపంలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇసుక దందా కోసమే కాళేశ్వరం పడావు

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో పేరుకుపోయిన లక్షలాది టన్నుల ఇసుకను తరలించి సొమ్ము చేసుకోవాలనే కాంగ్రెస్‌ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌డీఎస్‌ఏ (నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ) నివేదికను సాకుగా చూపెట్టి కాళేశ్వరం నుంచి నీటి ఎత్తిపోతలు నిలిపివేశారు. బ్యారేజీల్లో నీటిని నిల్వ వాటికి ప్రమాదమని ఎన్‌డీఎస్‌ఏ చెప్పిందని ఆయా బ్యారేజీల్లో గేట్లు ఎత్తి ఇసుకను ఇష్టారాజ్యంగా తోడేస్తున్నారు. 2024 యాసంగి సీజన్‌లో కాళేశ్వరంతో అవసరం లేకుండానే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు మొత్తం ఆయకట్టుకు నీళ్లిస్తామని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం గప్పాలు కొట్టి ఎస్సారెస్పీ స్టేజీ -2లోని తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లోని 2 లక్షల ఎకరాల్లో పంటలను ఎండబెట్టారు. ఎస్సారెస్పీ స్టేజీ -1లో లోయర్‌ మానేరుకు దిగువన ఉన్న ఆయకట్టులోనూ లక్ష ఎకరాలకు చివరి తడులు ఇవ్వకుండా పొలాలను ఎండబెట్టారు. ఈ ఏడాది కాళేశ్వరంతో పని లేకుండానే ఎస్సారెస్పీ నీళ్లిస్తామని చెప్తూ బ్యారేజీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం పడావు పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రయత్నంగా చూపెట్టడం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఇంకా దెబ్బతీయడమే లక్ష్యంగా ఆయా బ్యారేజీల నుంచి ఇష్టం వచ్చినట్టుగా ఇసుక తరలిస్తున్నారు. ఇసుక తరలింపును కట్టడి చేయకుంటే మూడు బ్యారేజీలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News