వలసల వనపర్తి నేడు వరిపంటల వనపర్తి
ముస్లింలను కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంకుగానే చూసిందని.. వారి అభివృద్ధి గురించి పట్టించుకోలేదన్నారు కేసీఆర్. తెలంగాణ గురుకులాల్లో నేడు వజ్రాల్లాంటి విద్యార్థులు తయారవుతున్నారని చెప్పారు.
ప్రజా ఆశీర్వాద సభల్లో కాస్త గ్యాప్ తీసుకున్న సీఎం కేసీఆర్ ఈరోజు మూడు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. ముందుగా ఆయన అచ్చంపేట సభకు హాజరయ్యారు, తర్వాత వనపర్తి, మునుగోడు సభల్లో పాల్గొన్నారు. వలసల వనపర్తిని నేడు వరిపంటల వనపర్తిగా చేసుకున్నామని చెప్పారు కేసీఆర్. కొందరు కాంగ్రెస్ నేతలు అక్కడికిరా.. ఇక్కడికి రా.. అంటున్నారని 119 నియోజకవర్గాల్లో కేసీఆర్ లు ఉన్నారని, వారితో తలపడాలని సవాల్ విసిరారు. ఉన్న తెలంగాణ ఊడగొట్టిందెవరు? తెలంగాణ కోసం కొట్లాడిందెవరో ప్రజలు ఆలోచించాలన్నారు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే వనపర్తిలో లక్ష ఎకరాలకు నీరు అందుతోందని.. వలసల వనపర్తిని.. వరి పంటల వనపర్తిగా చేసిన మొనగాడెవరు? అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గతంలో ఎంతో మంది మంత్రులుగా పని చేసినా.. ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేకపోయారని.. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి పట్టుబట్టి.. 5 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని చెప్పారు కేసీఆర్.
ముస్లింలను కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంకుగానే చూసిందని.. వారి అభివృద్ధి గురించి పట్టించుకోలేదన్నారు కేసీఆర్. తెలంగాణ గురుకులాల్లో నేడు వజ్రాల్లాంటి విద్యార్థులు తయారవుతున్నారని చెప్పారు. ఓట్ల కోసం అబద్ధాలు చెప్పనన్న కేసీఆర్.. మళ్లీ గెలిస్తే పింఛన్లను దశలవారీగా రూ.5వేలకు పెంచుతానని హామీ ఇచ్చారు. రైతులు కట్టాల్సిన కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తోందని, రైతుల భూమిపై వారికే అధికారం కట్టబెట్టామని చెప్పారు. రైతులపై వీఆర్వో, ఆర్‌ఐ, ఎమ్మార్వో పెత్తనం లేకుండా చేశామన్నారు కేసీఆర్.