పార్టీనుంచి వెళ్లిపోయే వారి గురించి ఆలోచించొద్దు..

100 రోజుల పాలన పూర్తికాక మునుపే కాంగ్రెస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని చెప్పారు కేసీఆర్. ఆ వ్యతిరేకతను బీఆర్ఎస్ బలంగా మార్చుకోవాలని, ఓట్ల రూపంలో మలచుకోవాలని నేతలకు సూచించారు.

Advertisement
Update:2024-03-11 09:50 IST

ఓవైపు బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికలకు సమాయత్తమవుతుండగా, మరోవైపు జంపింగ్ నేతలు గోడదూకేస్తున్నారు. పార్టీని నమ్ముకుని ఉన్నవారిలో ఈ వ్యవహారం కాస్త ఆందోళనకు కారణం అవుతోంది. అయితే అలాంటి భయాలేవీ పెట్టుకోవద్దని చెప్పారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయే వారి గురించి ఆలోచించొద్దని అన్నారు. జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గ సమావేశం సందర్భంగా స్థానిక నేతలతో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ కి 12 స్థానాలు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.


కాంగ్రెస్ పై వ్యతిరేకత..

100 రోజుల పాలన పూర్తికాక మునుపే కాంగ్రెస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని చెప్పారు కేసీఆర్. ఆ వ్యతిరేకతను బీఆర్ఎస్ బలంగా మార్చుకోవాలని, ఓట్ల రూపంలో మలచుకోవాలని నేతలకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై వచ్చిన వ్యతిరేకత ఇప్పుడు లేదన్నారు. రెండు పార్టీల పాలనకు ప్రజలు తేడా తెలుసుకోగలిగారని వివరించారు. డజనుకి పైగా లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశాలున్నాయని చెప్పారు కేసీఆర్.

జహీరాబాద్ టికెట్ ఎవరికి..?

జహీరాబాద్ అభ్యర్థి ఎంపిక బాధ్యతను కేసీఆర్​కే అప్పగిస్తూ నేతలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. కేసీఆర్ ఈ సమావేశంలో అభ్యర్థి పేరు ప్రస్తావించలేదు కానీ.. దాదాపుగా గాలి అనిల్‌ కుమార్‌ పేరు ఖరారైనట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ నుంచి ఇక్కడ లింగాయత్ వర్గానికి చెందిన అభ్యర్థులు పోటీలో నిలవబోతున్నారు. బీఆర్ఎస్ మున్నూరు కాపు అయిన గాలి అనిల్‌ కుమార్‌ కి టికెట్ ఇవ్వబోతోంది. త్వరలోనే ఈ లోక్​సభ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా కోఆర్డినేటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు కేసీఆర్. రెండు మూడు రోజుల్లో జహీరాబాద్ అభ్యర్థి ఎవరనేది అధికారికంగా ఆయన ప్రకటిస్తారు. 

Tags:    
Advertisement

Similar News