ఆ వీడియో చూపిస్తే ఎన్నికల బరినుంచి తప్పుకుంటా..
కేసీఆర్, బీఆర్‌ఎస్ అభ్యర్థి.. హాలియా సభలో చెప్పింది నిజమైతే జానారెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ చూపించాలన్నారు జైవీర్ రెడ్డి. తన తండ్రి ఎప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు.
సీఎం కేసీఆర్ ఇటీవల హాలియా సభలో జానారెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నాలుగేళ్లలో 24గంటల ఉచిత విద్యుత్ సాధ్యమైతే.. గులాబి కండువా కప్పుకుంటానని ప్రతిపక్ష నేతగా ఉన్న జానారెడ్డి అప్పట్లో సవాల్ చేశారని గుర్తు చేశారు కేసీఆర్. ఆయన నాలుగేళ్లు అంటే.. తాము ఏడాదిన్నరలోనే 24గంటల ఉచిత విద్యుత్ రైతులకు అందించామని.. కానీ జానారెడ్డి మాట తప్పారని, గులాబి కండువా కప్పుకోలేదన్నారు. పైగా ఉప ఎన్నికల్లో భగత్ పై పోటీ చేసి ఓడిపోయారని, ఈసారి కూడా కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు కేసీఆర్. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలపై జానారెడ్డి తనయుడు జైవీర్ రెడ్డి స్పందించారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున జానారెడ్డి తనయుడు జైవీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. తన తండ్రిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు జైవీర్ రెడ్డి స్పందించారు. జానారెడ్డి బీఆర్‌ఎస్ కండువా కప్పుకుంటానన్న వీడియో క్లిప్పింగ్ చూపిస్తే ఎన్నికల బరి నుంచి తాను తప్పుకుంటానని సవాల్ విసిరారు జైవీర్ రెడ్డి. నిడమానూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జైవీర్ రెడ్డి.. బీఆర్ఎస్ ఆరోపణలకు బదులిచ్చారు.
కేసీఆర్, బీఆర్‌ఎస్ అభ్యర్థి.. హాలియా సభలో చెప్పింది నిజమైతే జానారెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ చూపించాలన్నారు జైవీర్ రెడ్డి. తన తండ్రి ఎప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జైవీర్ రెడ్డి ప్రచారంలో చెమటోడుస్తున్నారు. తండ్రి నియోజకవర్గంలో తనయుడు గెలవాలనుకుంటున్నారు. అయితే జానారెడ్డిని ఓడించిన భగత్, ఇప్పుడు ఆయన తనయుడు జైవీర్ రెడ్డిని కూడా ఓడించేందుకు సిద్ధమయ్యారని స్థానికులంటున్నారు. భగత్ కే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తోంది.