నామినేషన్ రోజే పొంగులేటిపై ఐటీదాడులు..
ఈరోజు పొంగులేటి ఇల్లు, ఆఫీస్ లపై దాడులు కొనసాగుతున్నాయి. నేడు నామినేషన్ ఉండటంతో పొంగులేటి అనుచరులు ఆందోళనకు గురవుతున్నారు.
మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఐటీ దాడులు కలకలం రేపాయి. ఖమ్మంతోపాటు హైదరాబాద్ లోని ఆయన ఇల్లు, ఆఫీసుల్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన అనుచరుల నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకుని తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ నందగిరిహిల్స్ లోని వంశీరామ్ జ్యోతి హిల్ రిడ్జ్ తోపాటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్-10లోని రాఘవా ప్రైడ్ లో కూడా ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు.
రెండ్రోజుల క్రితమే పొంగులేటి ప్రకటన..
తనపై కూడా ఐటీ దాడులు జరుగుతాయని, కానీ తాను వాటికి భయపడేది లేదని పొంగులేటి రెండ్రోజుల క్రితమే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున ఆయన ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరగడం విశేషం. ఐటీ దాడులతో ఏం తేలుతుంది..? ఎన్నికల టైమ్ లో ఈ దాడులేంటి అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. దాడుల నేపథ్యంలో పొంగులేటి నివాసానికి భారీగా అనుచరులు చేరుకుంటున్నారు. హైదరాబాద్, ఖమ్మంలోని ఆయన ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
నేడే నామినేషన్..
ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీస్తున్న పొంగులేటి శ్రివాస్ రెడ్డి.. ఈరోజు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేసుకున్నారాయన. ఈ సందర్భంలో ఆయన నివాసంతోపాటు కార్యాలయాలపై దాడులు జరగడం విశేషం. బుధవారం ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరావు ఇంటిపై కూడా ఐటీ దాడులు జరిగాయి. ఈరోజు పొంగులేటి ఇల్లు, ఆఫీస్ లపై దాడులు కొనసాగుతున్నాయి. నేడు నామినేషన్ ఉండటంతో పొంగులేటి అనుచరులు ఆందోళనకు గురవుతున్నారు.