తాళం పగిలింది.. సోదాలు ముగిశాయి

ఈ రోజు మధ్యాహ్నం వరకు వేచి చూసి, చివరకు తాళం పగలగొట్టారు అధికారులు. ఆ రూమ్ నుంచి కూడా పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Update:2023-11-10 16:27 IST

పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు ముగిశాయి. 36గంటలసేపు అధికారులు ఇక్కడ సోదాలు నిర్వహించారు. గురువారం ఉదయం 4 గంటలకు సోదాలు ప్రారంభించగా, ఈ రోజు కూడా కొనసాగించారు. కాసేపటి క్రితం అధికారికంగా సోదాలు ముగిసినట్టు ప్రకటించారు. జూబ్లీహిల్స్ లోని పొంగులేటి నివాసంలో నుంచి మూడు బ్యాగులు, ఒక భ్రీఫ్ కేస్, ప్రింటర్, కీలక డాక్యుమెంట్లు సీఆర్‌పీఎఫ్ బలగాల రక్షణలో తరలించారు.

పగిలిన తాళం..

నిన్నటి నుంచి జూబ్లీహిల్స్ లోని పొంగులేటి రూమ్ తాళం మాత్రం అధికారులకు వారి కుటుంబ సభ్యులు అందజేయలేదు. ఆ తాళం పొంగులేటి కుటుంబ సభ్యుల దగ్గర ఉంది అని చెప్పారు, వారిని పిలిపించినా కూడా దాన్ని అధికారులకు ఇవ్వలేదు. ఈ రోజు మధ్యాహ్నం వరకు వేచి చూసి, చివరకు తాళం పగలగొట్టారు అధికారులు. ఆ రూమ్ నుంచి కూడా పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

సింపతీ వస్తుందా..?

అధికారుల టార్గెట్ ఏదైనా, వారి వెనకున్న పార్టీ ఏదైనా.. ఈ ఎన్నికల్లో ఈ ఎపిసోడ్ పొంగులేటికి లాభమా, నష్టమా అనేదే ఇప్పుడు ప్రశ్న. రాజకీయ కక్షతోనే ఐటీ సోదాలు జరిగాయని పొంగులేటి ఆరోపిస్తున్నారు. ప్రజల్లో సింపతీ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ గెలుపు ఖాయమైందని, అందుకే ఇలా సోదాల పేరుతో వేధిస్తున్నారని ఆ పార్టీ నేతలంటున్నారు. ఈ వాదన ఎలా ఉన్నా.. అన్యాయంగా దాడులు జరిగాయని ప్రజలు నమ్మితే, పొంగులేటిపై సింపతీ పెరిగే అవకాశముంది. దాడుల వల్ల ప్రత్యేకంగా ఆయన ఇమేజ్ డ్యామేజీ అయ్యే అవకాశమైతే లేదనే చెప్పాలి. 

Tags:    
Advertisement

Similar News