ఇదేనా ప్రజాపాలన?

సీఎం తీరుపై ఏఐఎస్‌ఎఫ్‌ నాయకుల అసహనం

Advertisement
Update:2024-09-26 16:00 IST

ప్రజాపాలన అంటే ఇదేనా అని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్‌ ప్రశ్నించారు. సీఎం రేవంత్‌ రెడ్డి దగ్గరే విద్యాశాఖ కూడా ఉందని, విద్యశాఖ ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడానికి ఏఐసీసీ స్టేట్‌ ఆఫీస్‌ బేరర్స్‌ జూబ్లీహిల్స్‌ లోని సీఎం ఇంటికి ఉదయం 7 గంటలకు వచ్చామని వారు తెలిపారు. ముఖ్యమంత్రి అపాయింట్‌ కావాలని కోరితే ఇవ్వలేదని.. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సీఎం ఇంటి ఎదుట ఫుట్‌ పాత్‌ పై పడిగాపులు కాసినా కనీసం స్పందించలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి తాము ఎంతో కష్టపడ్డామని.. ఈరోజును ముఖ్యమంత్రిని కలుద్దామన్నా కనీసం అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదన్నారు. ''ఇది ప్రజాపాలన.. ఎవరు వచ్చినా తన ఇంటి దగ్గర, సెక్రటేరియట్‌లో కలుస్తాను..'' అని పదే పదే సీఎం చెప్తున్నారే తప్ప ఆయన ఎవరినీ కలవడం లేనద్నారు. సీఎం నివాసం వద్ద ఉన్న ఆయన సిబ్బందిని అడిగితే సాయంత్రం 4 గంటల వరకు సీఎం బయటికి రారని చెప్తున్నారని, వచ్చినా ఎవరినీ కలువరని కూడా వాళ్లు చెప్తున్నారని తెలిపారు. విద్యారంగ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడానికి గంటల తరబడి ఎదురు చూసినా పట్టించుకునే వారే లేకుండా పోయారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కోసం పని చేసిన తమ పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. విద్యాశాఖ అత్యంత కీలకమైనదని.. ముఖ్యమంత్రి ఎవరినీ కలువనప్పుడు ఆ శాఖను మరో మంత్రికి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. విద్యాశాఖ మంత్రి అందరికీ అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రిదేనని అన్నారు. వారి వెంట ఏఐఎస్‌ఎఫ్‌ స్టేట్‌ ఆఫీస్‌ బేరర్స్‌ ఇటిక్యాల రామకృష్ణ, బానోత్ రఘురాం, గ్యార నరేశ్‌, కాసోజు నాగ జ్యోతి, బాలసాని లెనిన్ పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News