మెరుగుపడిన తెలంగాణ ఆర్థిక స్థితి.. పడిపోయిన ఏపీ ర్యాంకు

అన్ని రాష్ట్రాల బడ్జెట్‌లను విశ్లేషించి ఈ నివేదికను డాయిష్ బ్యాంక్ రూపొందించింది. ఆర్థిక లోటు, సొంత పన్నుల ఆదాయం, రాష్ట్ర అప్పుల స్థాయి, జీఎస్‌డీపీ శాతాలను ఈ ర్యాంకుల కోసం పరిగణలోకి తీసుకున్నారు.

Advertisement
Update:2023-08-14 06:44 IST

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితి మెరుగుపడింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింతగా దిగజారింది. ఈ మేరకు డాయిష్ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. 2023-24 బడ్జెట్ల తుది అంచనాలను విశ్లేషించి.. దీని ఆధారంగా ఆయా రాష్ట్రాల ఆర్థికి స్థితిపై డాయిష్ బ్యాంకు నివేదిక రూపొందించింది. 17 రాష్ట్రాలకు సంబంధించి తయారు చేసిన ఈ నివేదికను డాయిష్ బ్యాంక్ చీఫ్ ఎకానమిస్ట్ కౌశిక్ దాస్ ఈ నివేదిక రూపొందించారు.

తాజా నివేదిక ప్రకారం తెలంగాణ నాలుగో ర్యాంకు నుంచి మూడో స్థానంలోకి వచ్చింది. మహరాష్ట్ర మొదటి స్థానంలో, చత్తీస్‌గఢ్ రెండో స్థానంలో నిలిచింది. ఇక ఏపీ గతంలో 8 వ ర్యాంకులో ఉండగా.. ప్రస్తుతం 11వ ర్యాంకుకు చేరింది. 2022-23 నివేదికలో అత్యంత దారుణ స్థితిలో ఉన్న రాష్ట్రాలుగా పశ్చిమ బెంగాల్, పంజాబ్, బీహార్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌లు ఉన్నాయి. గుజరాత్ కూడా 2021-22తో పోలిస్తే గుజరాత్ గత బడ్జెట్‌ అంచనాల ప్రకారం ఐదు నుంచి ఏడో స్థానానికి పడిపోయింది.

2023-24 బడ్జెట్ తొలి అంచనాల మేరకు పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలు ఇంకా అట్టడుగు స్థానాల్లోనే ఉన్నాయి. ఇటీవలే కేరళ సీఎం పినరయ్ విజయ్ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని.. ఆర్థిక సంక్షోభం దిశగా రాష్ట్రం వెళ్తోందని వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే తెలంగాణ మాత్రం స్థిరమైన ఆదాయ వనరులు, వ్యవసాయం, ఇతర రంగాల్లో అభివృద్ధి కారణంగా తమ ఆర్థిక స్థితిని మెరుగు పరుచుకుంటోంది.

అన్ని రాష్ట్రాల బడ్జెట్‌లను విశ్లేషించి ఈ నివేదికను డాయిష్ బ్యాంక్ రూపొందించింది. ఆర్థిక లోటు, సొంత పన్నుల ఆదాయం, రాష్ట్ర అప్పుల స్థాయి, జీఎస్‌డీపీ శాతాలను ఈ ర్యాంకుల కోసం పరిగణలోకి తీసుకున్నారు. ఇంకా రెవెన్యూ ఆదాయం నుంచి చెల్లించే అప్పులు, వడ్డీలను కూడా లెక్కలోకి తీసుకొని నివేదిక రూపొందించారు.

Tags:    
Advertisement

Similar News