చెరువుల పునరుద్ధరణపై హైడ్రా ఫోకస్
చెరువుల, కుంటల లెక్కలు తీసేపనిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్‌లో చెరువులు, కుంటల లెక్క తేలడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఒక్కో శాఖ దగ్గర ఒక్కో లెక్క ఉందన్నారు. చెరువుల విస్తరణపై గందరగోళం నెలకొన్నదన్నారు. అక్రమార్కుల వద్ద హైడ్రా కఠినంగా వ్యవహరించడం వల్లనే నగర ప్రజలు స్థిరాస్థి వ్యాపారుల చేతుల్లో మోసపోకుండా ఆలోచిస్తున్నారన్నారు.మొదటి దశలో కూల్చివేతలతో భయపెట్టినా, రెండో దశలో చెరువులను పునరుద్దరించడమే లక్ష్యంగా...వివిధ సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు...రంగనాథ్ వెల్లడించారు.
మొన్నటివరకు హైడ్రా పేరు చెబితేనే బెంబేలెత్తిపోయారు. అలాంటి హైడ్రా ఇప్పుడు పూర్తిగా పంథా మార్చింది. ఓఆర్‌ఆర్ వరకు విస్తరించిన హైడ్రా పరిధిలో ఎన్ని చెరువులు ఉన్నాయో వాటిని ఎలా పునరుద్ధరించాలనేదానిపై దృష్టి సారించింది. నగరంలోని చెరువులు, కుంటలపై పూర్తిస్థాయిలో లెక్క తేలకపోవడంతో, నేషనల్ రిమోట్ సెన్సింగ్ డేటాతో పాటు సర్వేతో పాటు విలేజ్ మ్యాప్‌ల ఆధారంగా చెరువులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. చెరువులు, కుంటలు, నాలాల పునరుద్ధరణ కోసం మేధావులు, నిపుణులతో హైడ్రా కమిషనర్ సమావేశాలు ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. పెరిగిన పట్టణీకరణలో భాగంగా హైదరాబాద్‌లో భూముల అమాంతం పెరిగిపోవడంతో ప్రభుత్వ స్థలాలు, చెరువులు కబ్జాలకు గురవుతున్నట్లు హైడ్రా కమిషనర్ వెల్లడించారు. హైదరాబాద్‌లో ఇప్పటివరకు 61 శాతం చెరువులు కనుమరుగై ఆ ప్రాంతమంతా కాంక్రీట్ జంగిల్‌గా మారిందన్నారు. మిగిలిన 39 శాతం చెరువులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇప్పటికైనా స్పందించకపోతే మరో పదేళ్లలో చెరువులు కనిపించని పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రా చర్యలతో సామాన్యులకు కూడా ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ లపై అవగాహన ఏర్పడిందన్నారు. ఇల్లు కొనేటప్పుడు వివరాలు తెలుసుకుని స్థిరాస్థి వ్యాపారుల చేతిలో మోసపోకుండా జాగ్రత్త పడుతున్నారని రంగనాథ్ వివరించారు.