హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
డ్రగ్స్ డెలివరీ చేసేందుకు కారులో వెళుతున్నట్టు హైదరాబాద్ నార్కోటిక్స్ వింగ్‌కు సమాచారం అందింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కల్చర్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఏదో ఒక మార్గంలో డ్రగ్స్‌ను యథేచ్ఛగా నగరానికి తరలించేస్తున్నారు. అప్పుడప్పుడు మాత్రమే నిందితులు పట్టుబడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని బోయినపల్లి వద్ద పోలీసులు భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు.
జిన్నారం నుంచి బోయినపల్లి మీదుగా సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద డ్రగ్స్ డెలివరీ చేసేందుకు కారులో వెళుతున్నట్టు హైదరాబాద్ నార్కోటిక్స్ వింగ్‌కు సమాచారం అందింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బోయినపల్లి పోలీసుల సాయంతో డెయిరీ ఫామ్ రోడ్డు వద్ద నిందితుల వాహనాన్ని అడ్డగించారు. కారు డిక్కీలో ఎఫిటమైన్ డ్రగ్స్‌ను గుర్తించి కారు డ్రైవర్ వినోద్, నాగరాజు, శ్రీశైలంలను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ 8.5 కిలోలు ఉన్నాయని, వాటి విలువ రూ.8.5 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
మరో ఘటనలో..
రాజేంద్రనగర్‌లోనూ పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేయగా.. నిందితుల వద్ద 50 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్ లభించాయి. ఈ ఘటనలో నైజీరియాకు చెందిన మహిళను అరెస్ట్ చేశారు. మరో నలుగురు నిందితులు పరారయ్యారు. దంపతులతో పాటు మరో నలుగురు కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు సమాచారం. పరారైనవారి కోసం గాలింపు చేపట్టామని, వారిని పట్టుకుంటే మరింతమంది సమాచారం తెలిసే అవకాశముందని పోలీసులు తెలిపారు.