భారత ఆర్థిక శక్తిగా మారుతున్న హైదరాబాద్.. రిపోర్ట్ విడుదల చేసిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ సిటీ ఇప్పుడు అంతర్జాతీయ సంస్థలకు భారీగా డిమాండ్ ఉన్న ఒక గేట్ వేగా మారిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆఫీసు లీజింగ్ కార్యకలాపాల్లో నగరం అగ్రస్థానంలో ఉన్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

Advertisement
Update:2023-02-27 06:28 IST

ఇండియాలో హైదరాబాద్ నగరం ఒక ఆర్థిక శక్తిగా మారుతూ.. దూసుకొని పోతోందని యూకేకి చెందిన అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సేవల సంస్థ సావిల్స్ వెల్లడించింది. 'హైదరాబాద్ : ది స్ప్రింట్స్' పేరుతో రూపొందించిన నివేదికలో ఈ వివరాలు పేర్కొన్నారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం ఈ నివేదికను విడుదల చేశారు.  రాబోయే కొన్ని తరాల వరకు హైదరాబాద్‌ను బెస్ట్ బిజినెస్ సెంటర్‌గా నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు.

హైదరాబాద్ సిటీ ఇప్పుడు అంతర్జాతీయ సంస్థలకు భారీగా డిమాండ్ ఉన్న ఒక గేట్ వేగా మారిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆఫీసు లీజింగ్ కార్యకలాపాల్లో నగరం అగ్రస్థానంలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇక్కడి రియల్ ఎస్టేట్ రంగం ఎదగడానికి ప్రభుత్వ పాలసీలు, మౌళిక సదుపాయాల కల్పన, అందుబాటు ధరలు, అసవరమైన మానవ వనరుల కల్పన వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. మెరుగైన లైఫ్ స్టైల్ కారణంగా మరెన్నో కంపెనీలు హైదరాబాద్‌లో విస్తరిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.

హైదరాబాద్ వచ్చిన మొదటి సారి ఈ నగరం అభివృద్ధి చెందుతున్న వేగం చూసే అవకాశం లభించిందని.. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న శక్తివంతమైన ఆర్థిక కేంద్రాలకు ఇది ఒక ఉదాహరణ అని సావిల్స్ గ్లోబల్ సీఈవో మార్క్ రిడ్లీ అన్నారు. హైదరాబాద్ ఒక మహానగరంగా రూపుదిద్దుకుందని చెప్పారు. దశాబ్ద కాలంలో హైదరాబాద్ అత్యంత ఆశాజనకమైన, ముఖ్యమైన నగరంగా అవతరించిందని సావిల్స్ ఆసియా పసిఫిక్ సీఈవో క్రిస్టియన్ ఎఫ్ మాన్సిని అన్నారు. అతి తక్కువ కాలంలో హైదరాబాద్‌ అతిపెద్ద వ్యాపార మార్కెట్‌ కేంద్రంగా అవతరించింది. ఐటీ, లైఫ్‌ సైన్సెస్‌, లాజిస్టిక్స్‌, వేర్‌ హౌసింగ్‌ వంటి రంగాలకు భవిష్యత్తులో హైదరాబాద్‌ కీలక కేంద్రంగా మారనున్నదని సావిల్స్ ఇండియా సీఈవో మాథుర్ అభిప్రాయపడ్డారు.

సావిల్స్ అనే సంస్థ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ. దీనికి అమెరికా, యూరప్, ఆసియా పసిఫిక్, ఆఫ్రికా ఖండాల్లోని 70 దేశాల్లో 700 పైగా కార్యాలయాలు ఉన్నాయి. దాదాపు 40 వేల మంది ఈ సంస్థలో పని చేస్తున్నారు. ఇండియాలోని బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, పూణె, అహ్మదాబాద్ నగరాల్లో సావిల్స్ ఆఫీసులు ఉన్నాయి. 


Tags:    
Advertisement

Similar News