ఇబ్బందుల్లేని ప్రయాణం, దేశంలోనే హైదరాబాద్ కి రెండో స్థానం

హైదరాబాద్‌ లో వాహనాల వేగం మిగతా నగరాల్లో కంటే అధికంగా ఉందని, వాహనాల సంఖ్య పెరిగినా, వేగం తగ్గలేదని సర్వే వివరించింది. ఫుట్ పాత్ ల నిర్వహణ మెరుగ్గా ఉండటంతో పాదచారులు ప్రమాదాలకు గురి కావడంలేదని తెలిపింది.

Advertisement
Update:2023-04-28 12:11 IST

నగరాల అభివృద్ధి, ప్రజల జీవన విధానం ఎలా ఉందో తెలుసుకోడానికి రవాణా వ్యవస్థ కీలకం. ట్రాఫిక్ సమస్యలు లేని నగరాలే ప్రజలకు చికాకులేని జీవనాన్ని ఇస్తాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి ఏమాత్రం ఇబ్బంది లేదు అంటే, కచ్చితంగా ఆ నగరం నివాసయోగ్యమైన ప్రాంతాల లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ కి ఆ ఘనత లభించింది. దేశం మొత్తమ్మీద ఈజ్ ఆఫ్ మూవింగ్ ఇండెక్స్ లో హైదరాబాద్ రెండో స్థానం సంపాదించింది. ఆటంకం లేకుండా సాఫీగా ప్రయాణాన్ని సాగించేందుకు హైదరాబాద్‌ అనువైన నగరమని తేలింది.

దేశంలో అభివృద్ధి చెందుతున్న నగరాలు, మెగా సిటీల్లో రవాణా వ్యవస్థ ఎలా ఉంది? పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌, వ్యక్తిగత వాహనాల వాడకం తదితర అంశాలపై దేశావ్యాప్తంగా ఓలా మొబిలిటీ ఇన్ స్టిట్యూట్‌ ఫౌండేషన్‌ ఓ సర్వే నిర్వహించింది. ఈజ్ ఆఫ్ మూవింగ్ ఇండెక్స్ ని సిద్ధం చేసింది. ఇందులో ముంబై మొదటి స్థానంలో ఉండగా, హైదరాబాద్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. హైదరాబాద్ లో పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్ట్‌, ఫుట్‌ పాత్‌ ల నిర్మాణం బాగుందని ఆ సర్వే కితాబిచ్చింది.

కొన్ని నగరాల్లో పార్కింగ్ సౌకర్యం అధ్వాన్నంగా ఉంటుంది. బైక్ లు, కార్లలో బయటకు వెళ్తే ఎక్కడ పార్క్ చేయాలనేది పెద్ద సమస్య. బెంగళారులోని సగం ప్రాంతాల్లో ఇలాంటి సమస్య ఉంది. అయితే హైదరాబాద్ లో పార్కింగ్ సమస్య లేదని సర్వే తేల్చింది. టూవీలర్, ఫోర్ వీలర్ పార్కింగ్‌ సౌకర్యం ఇతర నగరాలతో పోల్చి చూస్తే హైదరాబాద్ లో మెరుగ్గా ఉందని పేర్కొంది. నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ బాగున్నా, వ్యక్తిగత వాహనాల వాడకం కూడా ఎక్కువగా ఉన్నట్టు సర్వే తేల్చింది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఎక్కువమంది ప్రజా రవాణాను వినియోగిస్తూ, నెలవారీగా తక్కువ ఖర్చు చేస్తున్నారని సర్వే తేల్చింది. హైదరాబాద్ లో ప్రజా రవాణా అందుబాటులో ఉన్నా కూడా ప్రజలు సొంత వాహనాలలోనే ప్రయాణానికి ఇష్టపడుతున్నారని, ఖర్చు ఎక్కువైనా సొంత వాహనాల్లోనే బయటకు వస్తున్నారని తెలిపింది. హైదరాబాద్‌ లో వాహనాల వేగం మిగతా నగరాల్లో కంటే అధికంగా ఉందని, వాహనాల సంఖ్య పెరిగినా, వేగం తగ్గలేదని సర్వే వివరించింది. ఫుట్ పాత్ ల నిర్వహణ మెరుగ్గా ఉండటంతో పాదచారులు ప్రమాదాలకు గురి కావడంలేదని తెలిపింది. 

Tags:    
Advertisement

Similar News