దగ్ధమవుతున్న కారు ఇంజిన్‌లో కరెన్సీ కట్టలు

కారు బానెట్‌లో కరెన్సీ కట్టలు తగలబడుతూ కనిపించాయి. మంటలు ఆర్పడానికి వచ్చిన పోలీసులు బానెట్ నిండా తగలబడుతున్న కరెన్సీ కట్టలను చూసి విస్తుపోయారు.

Advertisement
Update:2023-11-24 15:33 IST

వరంగల్ జిల్లాలో దగ్ధమవుతున్న ఓ కారు ఇంజిన్ లో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. కారు దగ్ధమవుతుండటంతో మంట‌లార్పేందుకు వచ్చిన పోలీసులకు ఇంజిన్‌లో నోట్ల కట్టలు కనిపించడంతో విస్తుపోయారు. మంటలార్పి కారును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అక్రమంగా తరలిస్తున్న డబ్బు భారీగా పట్టుబడుతోంది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు తరలిస్తూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నారు.

ఇప్పటివరకు పోలీసుల తనిఖీల్లో రాష్ట్రవ్యాప్తంగా 650 కోట్ల రూపాయలకు పైగా సొత్తు పట్టుబడింది. ఇవాళ వరంగల్ జిల్లా బొల్లికుంట సమీపంలో అక్రమంగా తరలిస్తున్న డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట సమీపంలో ఓ కారు వెళుతుండగా.. ఉన్నట్టుండి ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పే ప్ర‌య‌త్నం చేశారు.

ఈ సందర్భంగా కారు బానెట్‌లో కరెన్సీ కట్టలు తగలబడుతూ కనిపించాయి. మంటలు ఆర్పడానికి వచ్చిన పోలీసులు బానెట్ నిండా తగలబడుతున్న కరెన్సీ కట్టలను చూసి విస్తుపోయారు. డబ్బును అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇంజిన్‌లో కరెన్సీ కట్టలు పెట్టి తరలించడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. పట్టుబడ్డ నగదు ఏ పార్టీకి చెందిందో తెలుసుకోవడానికి పోలీసులు వాహనంలో ప్రయాణిస్తున్న వారిని విచారిస్తున్నారు. కారు బానెట్‌లో డబ్బు పెట్టి ఎవరి కంటా పడకుండా తీసుకువెళ్లాలని భావించినప్పటికీ అగ్ని ప్రమాదం జరిగి పోలీసులకు పట్టుబడాల్సి వచ్చింది.

Tags:    
Advertisement

Similar News