చేజారుతున్న నాయకులను కాపాడుకునేదెలా? రంగంలోకి దిగనున్న డీకే శివకుమార్?

కాంగ్రెస్ నుంచి వలసలు పెరిగితే అది మొదటికే మోసం అవుతుందని గుర్తించింది. ఇన్నాళ్లూ బెంగళూరు నుంచే చక్రం తిప్పుతున్న డీకే శివకుమార్‌ను నేరుగా రంగంలోకి దించాలని భావిస్తోంది.

Advertisement
Update:2023-10-03 09:26 IST

ఇతర పార్టీల నుంచి నాయకులు కాంగ్రెస్‌లో చేరుతుండటంతో కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తోంది. కానీ అదే సమయంలో చేజారిపోతున్న ముఖ్య నాయకులను ఆపడంలో విఫలం అవుతున్నది. కొత్తగా చేరుకున్న నాయకులకు టికెట్ల హామీ ఇచ్చి చేర్చుకుంటున్నారు. కానీ ఎన్నాళ్ల నుంచో పార్టీ కోసం కష్టపడుతూ.. టికెట్లు ఆశించిన వారిని మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం చేజారి పోతున్న నాయకులను బుజ్జగించడంలో పూర్తిగా విఫలం అయ్యిందని పార్టీలో చర్చ జరుగుతున్నది.

మెదక్, మల్కాజిగిరికి చెందిన కీలక నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. మెదక్ డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి రెండు రోజుల కిందనే పార్టీకి రాజీనామా చేశారు. మెదక్ టికెట్ మైనంపల్లి కొడుకు రోహిత్‌కు ఇస్తారనే ప్రచారానికి బలం చేకూరడంతో ఆయన పార్టీని వదిలి వెళ్లిపోయారు. మరోవైపు మేడ్చెల్ డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కూడా పార్టీని వీడారు. మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని శ్రీధర్ ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీలో చేరిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు టికెట్ కన్ఫార్మ్ అని తెలియడంతో పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ ఇద్దరి విషయంలో రాష్ట్ర నాయకులు పూర్తిగా విఫలమయ్యారని ఏఐసీసీ మండిపడుతోంది.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, మల్లు రవి తదితరులు నందికంటి శ్రీధర్ విషయంలో బుజ్జగింపు ప్రయత్నాలు చేశారు. అయితే శ్రీధర్‌కు స్పష్టమైన హామీ ఇవ్వడంలో వీళ్లు విఫలమయ్యారు. తిరుపతిరెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. ఇక భద్రాచలం సెగ్మెంట్‌లోని కీలకమైన నాయకులు బీఆర్ఎస్‌లో చేరిపోయారు. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో కూడా ముఖ్య నాయకులు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నారు. వీరందరినీ సముదాయించడంలో టీపీసీసీ ముఖ్య నాయకులు విఫలం అయ్యారని ఏఐసీసీ గుర్రుగా ఉన్నది.

కాంగ్రెస్ నుంచి వలసలు పెరిగితే అది మొదటికే మోసం అవుతుందని గుర్తించింది. ఇన్నాళ్లూ బెంగళూరు నుంచే చక్రం తిప్పుతున్న డీకే శివకుమార్‌ను నేరుగా రంగంలోకి దించాలని భావిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ రాగానే.. టికెట్ల ప్రకటన కంటే ముందే డీకే హైదరాబాద్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసంతృప్త నాయకులను పిలిపించుకొని వారికి స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడి పోవద్దని.. అధికారంలోకి రాగానే మంచి పదవి ఇస్తామని వారిని బుజ్జగించే ప్రయత్నం చేయనున్నారు. చేరికల పైనే దృష్టి పెట్టకుండా.. చేజారే నాయకులను కూడా కాపాడుకుంటేనే పార్టీకి భవిష్యత్ ఉంటుందని ఏఐసీసీ నాయకులు కూడా ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి చెప్పినట్లు తెలుస్తున్నది. మరి డీకే శివకుమార్ అసంతృప్త నాయకులను ఆపగలుగుతారా? లేదా అన్నది కాలమే చెబుతుంది.

Tags:    
Advertisement

Similar News