బీజేపీ తరపున 100 మంది అభ్యర్థులు రెడీ.. అయినా అమిత్ షా అసంతృప్తి!
బలమైన బీఆర్ఎస్‌ను ఎదుర్కునే లీడర్లు ఉన్నారా అని ప్రశ్నించగా.. రాష్ట్ర నాయకత్వం వద్ద సమాధానమే లేకుండా పోయినట్లు తెలిసింది.
తెలంగాణ బీజేపీ పరిస్థితి ఏంటో హైకమాండ్‌కు అర్థం కావడం లేదు. రాష్ట్రంలో బీజేపీ బలపడిందని ఇక్కడి నాయకులు చెబుతున్నారు. కానీ అధిష్టానం చేయించే సర్వేల్లో మాత్రం ఎలాంటి ఎదుగు బొదుగు లేదనే తెలుస్తోంది. దీంతో తెలంగాణ బీజేపీలోని కీలక నాయకులను కేంద్ర మంత్రి అమిత్ షా హుటాహుటిన ఢిల్లీ పిలిపించారు. వాస్తవానికి మంగళవారం కార్నర్ మీటింగ్స్‌కు సంబంధించి చివరి రోజు కార్యక్రమాలు ఉన్నాయి. భారీ ఎత్తున వీటిని జరపాలని రాష్ట్ర బీజేపీ భావించింది. సీనియర్ నాయకులు ఒక్కో దగ్గర పాల్గొనాలని భావించారు. కానీ ఇంతలోపే అధిష్టానం నుంచి పిలుపు రాగానే.. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ పక్కన పెట్టి ఢిల్లీ వెళ్లారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలా సమాయత్తం అవుతున్నారని.. అభ్యర్థులు ఉన్నారా అని అమిత్ షా రాష్ట్ర నాయకులను ఆరా తీశారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేం రెడీగా ఉన్నామని.. 100 మంది అభ్యర్థులు పోటీకి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. అయితే.. బీ ఫామ్ ఇస్తే పోటీ చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారు. కానీ బలమైన బీఆర్ఎస్‌ను ఎదుర్కునే లీడర్లు ఉన్నారా అని ప్రశ్నించగా.. రాష్ట్ర నాయకత్వం వద్ద సమాధానమే లేకుండా పోయినట్లు తెలిసింది. అమిత్ షా అసలు ఎందుకు పిలిచారో అప్పుడు బీజేపీ నాయకులకు అర్థమైంది.
దక్షిణాదిలో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ చేసింది. ఈ రెండు రాష్ట్రాలను అమిత్ షా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అయితే తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడక పోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. బలమైన అభ్యర్థులను వెంటనే గుర్తించాలని రాష్ట్ర నాయకులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా.. ప్రజల్లోకి పార్టీ వెళ్లక పోవడం వెనుక కారణాలు విశ్లేషించాలని చెప్పారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకవేళ ముందస్తుకు వెళితే బీజేపీ గందరగోళంలో పడుతుందని హెచ్చరించారు. వాస్తవానికి రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి అమిత్ షా చెప్పినట్లే ఉందని పార్టీలో చర్చ జరుగుతున్నది. ఆ పార్టీకి ఎన్నికల బరిలో దిగే బలమైన అభ్యర్థులు కరువయ్యారు. హుజూరాబాద్, మునుగోడులో పోటీ ఇచ్చిన ఈటల, కోమటిరెడ్డి వంటి అంగ, అర్థ బలమున్నటు వంటి నేతలు బీజేపీలో కనపడటం లేదు. తమ చరిష్మాపై గెలవగలిగే బండి సంజయ్, డీకే అరుణ, రఘునందన్ రావు వంటి నేతలను కూడా వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.
ప్రస్తుతం బీజేపీలోకి వలస వచ్చిన చాలా మంది నేతలకు క్షేత్ర స్థాయిలో ప్రజాబలం లేదు. కాంగ్రెస్ నుంచి వచ్చిన పొంగులేటి సుధాకర్ రెడ్డి వంటి వారు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలవగలిగే సామర్థ్యమే లేదు. పదవులు ఆశించి పార్టీలోకి వచ్చే వారితో ఎన్నికలను ఎదుర్కోవడం కష్టమని కూడా అమిత్ షా తేల్చి చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి బలమైన నేతలను త్వరగా పార్టీలోకి తీసుకొని వచ్చే ప్రయత్నాలు చేయమని చెప్పారు.
బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేయడానికి చేరికల కమిటీని ఏర్పాటు చేశారు. ఈటల రాజేందర్‌ను దీనికి చైర్మన్‌ను చేసినా.. ఇంత వరకు ఆయన పార్టీలోకి ఒక్క బలమైన నాయకుడిని కూడా తేలేక పోయారనే ఆరోపణలు ఉన్నాయి. పైగా అతడి అనుచరులే తిరిగి బీఆర్ఎస్‌లోకి వెళ్లిపోతుండటం కూడా అధిష్టానానికి ఆగ్రహం తెప్పిస్తోంది. బీఆర్ఎస్ అసంతృప్త నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీజేపీలోకి తీసుకొస్తామని మాటిచ్చారు. కానీ పొంగులేటి మాత్రం బీజేపీ వైపు వెళ్లడానికి జంకుతున్నారు. మరోవైపు రాష్ట్ర బీజేపీలోని సీనియర్ల మధ్య ఉన్న మనస్పర్థలను కూడా అమిత్ షా ప్రస్తావించారు. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా చేసుకోవాలని.. ఇలాంటి చిన్ని చిన్న విషయాలను పక్కన పెట్టాలని సూచించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి చూస్తే.. కనీసం 80 నుంచి 90 మంది బలమైన నేతలు కావాలి. అంత భారీ సంఖ్యలో నాయకులను ఇప్పటికిప్పుడు తయారు చేయడం కష్టం. అందుకే ఇతర పార్టీల్లోని బలమైన నాయకులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకొని రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆఖరి క్షణంలో ఏ నాయకుడికి అయినా బీఫామ్ రాక అసంతృప్తితో ఉంటే.. అలాంటి వారిని బీజేపీ తరపున నిలబెట్టాలనే చర్చ కూడా జరిగినట్లు తెలుస్తున్నది. హుజూరాబాద్, దుబ్బాక విజయాలతో బీజేపీ తెలంగాణలో బలపడిందని భావించిన అధిష్టానానికి.. అసలు పరిస్థితి ఇప్పుడు అర్థమవుతోంది.
ఆనాటి గెలుపులు అసలు బీజేపీ బలం కాదని..అవి అభ్యర్థుల వల్ల వచ్చిన విజయాలేనని తెలుసుకున్నది. అందుకే ఇప్పుడు పార్టీని బలోపేతం చేయడమే కాకుండా.. బలమైన అభ్యర్థుల కోసం కూడా అన్వేషణ ప్రారంభించింది. మరి ఎన్నికలను కొన్ని నెలల సమయమే ఉన్న నేపథ్యంలో బీజేపీ వ్యూహాలు ఎంత మేరకు సఫలం అవుతాయో చూడాలి.