మీకు మేనిఫెస్టో ఎందుకు.. రాహుల్‌గాంధీకి హరీష్ ఘాటు లేఖ
మేనిఫెస్టోపై అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో అనేక సార్లు మాట తప్పిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు ఏ ధైర్యంతో మళ్లీ మేనిఫెస్టో విడుదల చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
కాంగ్రెస్‌పై వరుసగా లేఖాస్త్రాలు సంధిస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తాజాగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ప్రధానంగా కాంగ్రెస్ మేనిఫెస్టోపై రాహుల్‌గాంధీకి ప్రశ్నలు సంధించారు. ఎన్నికల ముందు అరచేతిలో స్వర్గం చూపిస్తూ ప్రజలకు హామీలివ్వడం, తర్వాత అమలు చేయలేక చేతులెత్తేయడం కాంగ్రెస్‌కు అలవాటేనన్నారు.
ఇక ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అనేక హామీలిచ్చారని.. అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని లేఖలో గుర్తుచేశారు హరీష్ రావు. మేనిఫెస్టోపై అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో అనేక సార్లు మాట తప్పిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు ఏ ధైర్యంతో మళ్లీ మేనిఫెస్టో విడుదల చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అసలు కాంగ్రెస్ మేనిఫెస్టోలకు విలువ ఉందా అంటూ ప్రశ్నించారు. అమలు చేయని హామీల కోసం మేనిఫెస్టోలు ఎందుకు అంటూ లేఖలో రాహుల్‌ను నిలదీశారు హరీష్ రావు.
రాజ్యాంగ పరిరక్షణ చాప్టర్‌లోని 13వ పాయింట్ ప్రకారం.. ప్రజా ప్రతినిధులు ఎవరైనా పార్టీ మారితే.. వెంటనే సభ్యత్వం పోయేలా చట్టం తెస్తామని మేనిఫెస్టోలో పెట్టారని, కానీ తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోందన్నారు హరీష్ రావు. మేనిఫెస్టోలో చెప్తున్న నీతులకు, అధికారంలో ఉండి చేస్తున్న చేతలకు ఏ మాత్రం పొంతన లేదంటూ చురకలు అంటించారు. ఇక తుక్కుగూడ సభలో రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఇప్పటికే ఇచ్చిన హామీలను విస్మరించి.. మళ్లీ కొత్త హామీలివ్వడం నీతిమాలిన చర్య అంటూ లేఖలో ఫైర్ అయ్యారు.