హరీష్ వర్సెస్ రేవంత్.. నెక్స్ట్ ఎపిసోడ్
"రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్థూపం దగ్గరకి నా రాజీనామా లేఖతో వస్తా..నువ్వు వస్తావా? మన ఇద్దరి రాజీనామా లేఖలను మేధావులకు ఇద్దాం.."
తెలంగాణ రాజకీయాలు రాజీనామాల సవాళ్ల చుట్టూ తిరుగుతున్నాయి. ఆగస్ట్ 15లోపు రుణమాఫీ చేసి తీరుతానని సీఎం రేవంత్ రెడ్డి ధీమాగా చెబుతుంటే, చేయలేకపోతే రాజీనామా చేస్తారా అంటూ హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. నా రాజీనామా కాదు, మీ పార్టీని రద్దు చేస్తారా అంటూ ఈ కౌంటర్ కి బదులిచ్చారు సీఎం రేవంత్. దీనికి హరీష్ మళ్లీ స్పందించారు. పార్టీని రద్దు చేయడం కాదు నేనే రాజీనామా చేస్తే, ఉప ఎన్నికల్లో కూడా మళ్లీ పోటీ చేయనని అన్నారు. ఈ రాజీనామా సవాల్ కి రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.. హరీష్ రావును రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఇక్కడ ఈ ఎపిసోడ్ లేటెస్ట్ మలుపు తిరిగింది. హరీష్ రావు మళ్లీ రేవంత్ కి బదులిచ్చారు. ఆయన కూడా రాజీనామా లేఖతో రావాలని సవాల్ విసిరారు.
"రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్థూపం దగ్గరకి నా రాజీనామా లేఖతో వస్తా..నువ్వు వస్తావా? మన ఇద్దరి రాజీనామా లేఖలను మేధావులకు ఇద్దాం.. ఆగస్టు 15 లోగా మీరు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసి, రుణమాఫీ చేస్తే.. వారు నా రాజీనామా లేఖను స్పీకర్‌కు ఇస్తారు, చేయలేకపోతే నీ రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇస్తారు." దీనికి సిద్ధమేనా అంటూ హరీష్ రావు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. "నువ్వు మాట మీద నిలబడే వాడివి అయితే రా.. నువ్వు రాకపోతే తెలంగాణ ప్రజలకు అసలు విషయం అర్థమవుతుంది. కొడంగల్ లో రాజకీ సన్యాసం తీసుకుంటా అని తోకముడిచినట్టే.. ఇప్పుడు కూడా తోకముడిచావని స్పష్టమవుతుంది." అని అన్నారు హరీష్ రావు.
హరీష్ రావు తాజా సవాల్ కి రేవంత్ వర్గం ఇంకా స్పందించలేదు. మరి రేవంత్ రెడ్డి రాజీనామా లేఖతో అసెంబ్లీ వద్దకు చేరుకుంటారా..? లేక ఈ ఎపిసోడ్ ని కొనసాగించేలా మరో కొత్త సవాల్ తో రెడీగా ఉంటారా అనేది తేలాల్సి ఉంది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి హామీలని అమలు చేయడం ప్రతిపక్షంగా తమ బాధ్యత అంటున్న హరీష్ రావు.. పట్టుబట్టి మరీ రేవంత్ రెడ్డితో ఆగస్ట్-15 డెడ్ లైన్ గా పెట్టించగలిగారు. అంతే కాదు.. హామీలు అమలు చేయలేకపోతే సాకు చెప్పి తప్పించుకోకుండా లాక్ చేశారు.