కాంగ్రెస్ నిర్వాకం.. 5 నెలల్లోనే కుప్పకూలిన వ్యవస్థ
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డయాగ్నస్టిక్స్ కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులకు,సిబ్బందికి పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం వల్ల 5 నెలల్లోనే తెలంగాణలో డయాగ్నస్టిక్ వ్యవస్థ కుప్పకూలిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు గత బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థను ప్రారంభించామని, దాన్ని కొనసాగించలేక, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక అస్తవ్యస్థంగా మార్చారని అన్నారు. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు హరీష్ రావు.
6 నెలలుగా జీతాల్లేవు..
బీఆర్ఎస్ హయాంలో పేదల వైద్య పరీక్షలకోసం రాష్ట్రవ్యాప్తంగా 36 డయాగ్నస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 134 రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకువచ్చారు. డయాగ్నస్టిక్ కేంద్రాల ఏర్పాటుతో వైద్య సేవల్లో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారని అన్నారు హరీష్ రావు. అలాంటి కేంద్రాల్లో సిబ్బందికి 6 నెలలుగా జీతాలు లేని పరిస్థితిని ఆయన ప్రస్తావించారు. ఆ కేంద్రాలు ఇప్పుడు నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు. ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనం అని అన్నారు హరీష్ రావు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డయాగ్నస్టిక్స్ కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులకు,సిబ్బందికి ఆరు నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. డయాగ్నస్టిక్ కేంద్రాల ద్వారా అన్ని రకాల పరీక్షలు, వైద్య సేవలు ప్రజలకు అందే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. వీలైతే మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉన్న వ్యవస్థలను కుప్పకూల్చడం సరికాదని, పేదల ఆరోగ్యంతో ఆటలాడొద్దని సూచించారు హరీష్ రావు.