కల్యాణ లక్ష్మి చెక్కు బౌన్స్ అయింది.. తులం బంగారం తుస్సుమన్నది
వికాసం కావాలంటే వినోద్ అన్నకు ఓటు వేయాలని, విధ్వసం కావాలంటే కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేయాలన్నారు హరీష్ రావు.
తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. హామీలు అమలు చేయకుండా నేతలు కాలయాపన చేస్తున్నారని, ఇప్పటికే ప్రజలు చాలా నష్టపోయారని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు ప్రతి కుటుంబానికి నెలకు రూ. 2500 బాకీపడ్డారని, ఐదు నెలలకు 12,500 రూపాయల చొప్పున లెక్క తేలిందని, ఆ డబ్బులు ఇచ్చాకే వారికి ఓటు వేస్తామని అక్క చెల్లెమ్మలు చెప్పాలన్నారు హరీష్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కి మద్దతుగా కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు హరీష్ రావు.
నా చందా రూ.2 లక్షలు
హుస్నాబాద్ అంటే కేసీఆర్‌కు చాలా ఇష్టం అని, సెంటిమెంట్ ఉన్న ప్రాంతం అని చెప్పారు హరీష్ రావు. వికాసం కావాలంటే వినోద్ అన్నకు ఓటు వేయాలని, విధ్వసం కావాలంటే కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేయాలన్నారు. బీజేపీ బడా కార్పొరేట్ సంస్థల గురించి మాత్రమే ఆలోచిస్తుందని, రూ.14 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలను మాఫీ చేసిందని, పేదలకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని అన్నారాయన. బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ అని, నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతుల ఉసురు పోసుకుందని చెప్పాారు. అయోధ్య రామాలయం బీజేపీ కట్టిందా అని సూటిగా ప్రశ్నించారు హరీష్ రావు. రామాలయం కట్టించింది ట్రస్ట్ అని, ఆలయ నిర్మాణానికి తాను కూడా రూ.2 లక్షల విరాళం ఇచ్చానని గుర్తు చేసుకున్నారు.
హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ సభ తుస్సుమన్నదని, జనం కోసం 30 వేల కుర్చీలు వేస్తే 3 వేల మంది కూడా రాలేదన్నారు హరీష్ రావు. ఎన్నికల ప్రచారంలో హుస్నాబాద్ కు మెడికల్ కాలేజీ ఇస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారని, ఆ హామీ నెరవేరిందా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కంటే రాహుల్ గాంధీ ఎక్కువ అబద్ధాలు మాట్లాడున్నారని, ఆయన రాహుల్ గాంధీ కాదని, రాంగ్ గాంధీ అని అన్నారు. కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్‌లో ఉందని, ఆ పార్టీ గెలిచే ప్రసక్తే లేదన్నారు హరీష్ రావు.