రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతారా..? మాటలు జాగ్రత్త
బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు అనేక ముళ్ల బాటలు చూసిందని, పూలబాటను కూడా చూసిందని చెప్పారు హరీష్ రావు. బీఆర్‌ఎస్‌కు ఉద్యమాలు కొత్త కాదన్నారు. దాడులు, బెదిరింపులకు భయపడేది లేదన్నారు.
రైతుబంధు డబ్బులు అడిగితే చెప్పుతో కొడతామంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడటం దారుణం అని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో పాల్గొన్న ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నవారికి ఓపిక ఉండాలని, కానీ కాంగ్రెస్ నేతలు అసహనంతో ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ప్రజల్ని చెప్పుతో కొడతామంటున్నారని, ఎవరు ఎవర్ని చెప్పులతో కొడతారో త్వరలోనే తేలిపోతుందన్నారు.
ముళ్లబాట.. పూలబాట
బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు అనేక ముళ్ల బాటలు చూసిందని, పూలబాటను కూడా చూసిందని చెప్పారు హరీష్ రావు. బీఆర్‌ఎస్‌కు ఉద్యమాలు కొత్త కాదన్నారు. దాడులు, బెదిరింపులకు భయపడేది లేదన్నారు. నాడు పది సీట్లు వచ్చినా వెనకడుగు వేయలేదని, ఇప్పుడు కూడా వెనకడుగు వేయబోమని చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కు కేవలం 1.8శాతం మాత్రమే ఓట్లు తక్కువగా వచ్చాయన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ ని ప్రజలు తిరస్కరించలేదని, 39 స్థానాల్లో అభ్యర్థులను గెలిపించారన్నారు. మరో 4 లక్షల ఓట్లు వచ్చి ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడేదని చెప్పారు హరీష్ రావు.
సెక్రటేరియట్ లో లంకె బిందెలు ఉన్నాయని వస్తే, ఖాళీ బిందెలు కనపడ్డాయంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా హరీష్ రావు స్పందించారు. లంకె బిందెలు ప్రభుత్వ భవనాల్లో ఉంటాయా ? లేక పాడుబడిన ఇళ్లలో ఉంటాయా? అని ప్రశ్నించారు. అసత్య హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అసహనం వ్యక్తం చేస్తోందని, రూ. 2 లక్షల రుణమాఫీ, వరి ధాన్యానికి రూ. 5 వేల బోనస్, ఆసరా పెన్షన్ రూ. 4 వేలకు పెంపు, కరెంట్ బిల్లుల మాఫీ వంటి హామీలు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు హరీష్ రావు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్‌ఎస్ మాత్రమేనని.. కాంగ్రెస్, బీజేపీలు కాదని స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఎంపీలను అధిక సంఖ్యలో గెలిపిస్తేనే కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై నిలదీసే అవకాశం లభిస్తుందని చెప్పారు హరీష్ రావు.