అసెంబ్లీ వద్ద ప్రమాణం చేద్దామా..? రేవంత్ కి హరీష్ కౌంటర్

ఎల్లుండి అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దామా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు హరీష్ రావు.

Advertisement
Update:2024-04-24 13:11 IST

తెలంగాణ రాజకీయాల్లో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఆగస్ట్-15న రుణ మాఫీకి సీఎం రేవంత్ రెడ్డి కొత్త డెడ్ లైన్ పెట్టడమే దీనికి కారణం. ఆ డెడ్ లైన్ లోగా రుణమాఫీ చేయలేకపోతే సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు రేవంత్ రెడ్డి బదులిచ్చారు. తాను రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ ని రద్దు చేస్తారా అని అడిగారు. దీనికి తాజాగా హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ కాదని, తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని..? తిరిగి ఉప ఎన్నికల్లో కూడా పోటీచేయబోనని సవాల్ విసిరారు.

అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఒత్తిడి తెచ్చే బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందన్నారు హరీష్ రావు. ఎల్లుండి అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దామా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. "ఆగస్ట్ 15 లోపు మీరు ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రమాణం చెయ్యండి. ఆ లోగా పూర్తిగా రుణమాఫీ చేస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. తిరిగి ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయను. ఒకవేళ మీరు రుణమాఫీ చేయలేకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా..?" అని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు హరీష్ రావు.

తనకు పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యమన్నారు హరీష్ రావు. కానీ రేవంత్ రెడ్డికి పదవే ముఖ్యమని, మాటపై నిలబడరని ఎద్దేవా చేశారు. గతంలో కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన రేవంత్ రెడ్డి తోక ముడిచి మాట తప్పి, తిరిగి ఎంపీగా పోటీ చేశారన్నారు. ఆరు గ్యారెంటీలను డిసెంబర్ 9 నాడు అమలు చేస్తానని మరోసారి మాట తప్పారని, ఆరు గ్యారెంటీలను చట్టబద్ధం చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే పార్టీ రద్దు చేసుకుంటారా అంటూ తొండి మాటలు మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. మరి రేవంత్ దీనికి బదులిస్తారా..? లేదా అనేది వేచి చూడాలి. 

Tags:    
Advertisement

Similar News