పక్కాగా గృహలక్ష్మి.. 1.06 లక్షల మందికి అందిన సాయం

ఇప్పటి వరకు లక్షా ఆరువేల మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం మంజూరు పత్రాలను అందించారు. అత్యధికంగా జగిత్యాల నియోజకవర్గంలో 8,000 మందికి ఈ సాయం మంజూరైంది.

Advertisement
Update:2023-10-03 07:10 IST

ఇంటి స్థలం లేని పేదలకు పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తోంది. మరోవైపు ఇంటి స్థలం ఉన్నవారికి నిర్మాణ ఖర్చులకోసం 3లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తూ గృహలక్ష్మి పథకాన్ని కూడా అమలు చేస్తోంది. పేదల సొంతింటి కలను ఈ రెండు మార్గాల్లో తీరుస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వం. గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపిక సాహసమే అయినా.. ఇప్పటికే లక్షా ఆరువేల మందికి ఆర్థిక సాయం మంజూరు పత్రాలు పంపిణీ చేశారు నేతలు, అధికారులు. మొత్తం 4 లక్షలమందికి ఈ సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఊహించని స్థాయిలో దరఖాస్తులు..

ప్రభుత్వం 4లక్షలమందికి ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించి ఈ బడ్జెట్ లో 12వేల కోట్ల రూపాయలు కేటాయించింది. అయితే ప్రజల నుంచి ఊహించని స్థాయిలో స్పందన వస్తోంది. 15లక్షలమంది రాష్ట్రవ్యాప్తంగా గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 10లక్షలమంది అర్హులని తేల్చారు అధికారులు. వివిధ రకాల వడపోతల తర్వాత వారిలో 4లక్షలమందిని ఎంపిక చేయాల్సి ఉంది. మిగతావారికి కూడా అన్యాయం జరగదని గృహలక్ష్మి నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.

జగిత్యాలలో అధికం..

ఇప్పటి వరకు లక్షా ఆరువేల మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం మంజూరు పత్రాలను అందించారు. అత్యధికంగా జగిత్యాల నియోజకవర్గంలో 8,000 మందికి ఈ సాయం మంజూరైంది. ఖమ్మం, సంగారెడ్డిలో 7 వేలమందికి పైగా లబ్ధిదారులు ఆర్థిక సాయం అందుకుంటున్నారు. హైదరాబాద్‌, కామారెడ్డి, నల్లగొండ నియోజకవర్గాల్లో ఒక్కోచోట 6 వేలకుపైగా గృహలక్ష్మి పత్రాలు మంజూరు చేశారు. దశలవారీగా మొత్తం 4లక్షలమందికి ఈ పథకాన్ని అమలు చేస్తారు.

Tags:    
Advertisement

Similar News