ప్రభుత్వ ఉద్యోగి సూసైడ్.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
ప్రతి నెలా ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోందన్న కేటీఆర్.. ఈ ప్రచారం పూర్తిగా అబద్ధమన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్పిన మాట.. ప్రజా ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతం జమ చేస్తున్నామని. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. జీతాలు అందక కిందిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలువురు ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
తాజాగా సూర్యాపేట జిల్లా ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్న వసీం అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. మూడు నెలలుగా జీతం రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్‌కు ముందు భార్యకు ఓ నోట్ రాశాడు వసీం. జీవితంలో ఎన్నో కలలు కన్నానని, కానీ ఏది కుదరలేదని లేఖలో రాసుకొచ్చాడు. కొందరికి తాను డబ్బు ఇవ్వాలంటూ వారి పేర్లు లేఖలో రాశాడు వసీం.
వసీం ఆత్మహత్యపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతి నెలా ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు ఇస్తున్నామని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోందన్న కేటీఆర్.. ఈ ప్రచారం పూర్తిగా అబద్ధమన్నారు. మూడు నెలలుగా జీతం రాకపోవడంతో మనస్తాపం చెందిన వసీం ఆత్మహత్య చేసుకున్నాడంటూ ట్వీట్ చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. వసీం ఆత్మహత్యకు బాధ్యులెవరంటూ ప్రశ్నించారు కేటీఆర్.