సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల కోసం పోరాడుదాం
పార్టీ నాయకులకు మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపు
కాంగ్రెస్ ప్రభుత్వం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను నిర్వీర్యం చేసిందని.. ఈ రెండు లిఫ్ట్ స్కీంల సాధన కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణ ఖేడ్, ఆంథోల్ నియోజకవర్గాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ నియోజకవర్గాల్లోని 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్న కేసీఆర్ ఆకాంక్షను నెరవేర్చుదామని అన్నారు. రెండేళ్ల క్రితం కేసీఆర్ ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుల వైపు తొంగి కూడా చూడలేదన్నారు. ఈ ప్రభుత్వం తీరుతో నాలుగు నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందకుండా పోయే ప్రమాదం తలెత్తిందన్నారు. ఈ ప్రాజెక్టుల సాధన కోసం త్వరలోనే ప్రత్యక్ష పోరాటాలు చేద్దామని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, చింత ప్రభాకర్, మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ జైపాల్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
గుమ్మడిదలను మరో లగచర్ల చేయకండి
గుమ్మడిదలను మరో లగచర్ల చేయవద్దని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో జీహెచ్‌ఎంసీ డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా స్థానికులు చేపట్టిన ఆందోళనకు శుక్రవారం ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్ రావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి హరీశ్ రావు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డంపింగ్ యార్డులో నర్సాపూర్ చెరువు కలుషితమవుతుందన్నారు. డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని రేవంత్ రెడ్డి వందలాది మందిని ఎత్తుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెడుతున్నాడని.. రేవంత్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తుందన్నారు. రాత్రికి రాత్రి పనులు పూర్తి చేసి డంపింగ్ యార్డు ఏర్పాటు చేసే కుట్రలు చేస్తున్నారని.. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా పనులు చేయడం ఏమిటని నిలదీశారు. గుమ్మడిదలలో డంపింగ్ యార్డు ఏర్పాటును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డు పనులపై హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయాలన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు పనులు ఆపాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్, సంగారెడ్డి కలెక్టర్‌లను డిమాండ్ చేశారు.