కేసీఆర్ అలా చేసి ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదే కాదు
ఆ టైమ్ లో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకుని ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేది కాదని, రేవంత్ రెడ్డి సీఎం అయిఉండేవారు కాదని చెప్పారు బీఆర్ఎస్ నేత గట్టు.
తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడే ముందు జరిగిన కీలక పరిణామాలను వివరించి కాంగ్రెస్ కి షాకిచ్చారు బీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు. ఆ టైమ్ లో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకుని ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేది కాదని, రేవంత్ రెడ్డి సీఎం అయిఉండేవారు కాదని చెప్పారు. కేసీఆర్ అప్పుడు సైలెంట్ గా ఉన్నారు కాబట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తిరిగి తమ ఎమ్మెల్యేలనే వారివైపు తిప్పుకుంటోందని, మరింతమంది పార్టీ మారతారని బెదిరిస్తున్నారని మండిపడ్డారు గట్టు.
అప్పుడేం జరిగిందంటే..?
కాంగ్రెస్ బొటాబొటి మెజార్టీతో అధికారంలోకి వచ్చిందనే విషయం అందరికీ తెలిసిందే. అప్పటికే కాంగ్రెస్ లో గ్రూపులున్నాయి, ఎవరి గ్రూప్ లో ఎవరుంటారు..? ఎవరు ఎవరికి మద్దతిస్తున్నారనే విషయంపై కూడా తీవ్ర చర్చలు జరుగుతున్న సందర్భం అది. ఆ టైమ్ లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తో టచ్ లోకి వచ్చారని అంటున్నారు గట్టు రామచంద్రరావు. ఆ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొని ఉంటే అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యేదా అని ప్రశ్నించారు. ఆ ఆరుగురు ఎమ్మెల్యేలను కేసీఆర్ దగ్గరకు రానివ్వలేదని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు అవకాశం లభించిందని చెప్పారు గట్టు.
కేసీఆర్ ని కాదు.. రేవంత్ ని జైలులో పెట్టాలి
కేసీఆర్ కి జైలులో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానంటూ రైవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా గట్టు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి రహస్య సంబంధాలు పెట్టుకుని రాహుల్ గాంధీ పరువు తీశారని అన్నారు. ఓవైపు పార్టీ ఫిరాయింపుపై చట్టం తెస్తామని రాహుల్ అంటుంటే.. మరోవైపు రేవంత్ మాత్రం ఫిరాయింపులకు పాల్పడిన వారిని రాహుల్ పక్కనే స్టేజ్ పైనే కూర్చోబెట్టారని ఎద్దేవా చేసారు. ఓటుకు నోటు కేసులో రూ.50లక్షలు ఎక్కడి నుంచి తెచ్చారో ఇంత వరకు రేవంత్ క్లారిటీ ఇవ్వలేదని, సీఎం పదవి పోయిన తర్వాత ముందుగా జైలుకు పోయేది ఆయనేనని కౌంటర్ ఇచ్చారు. రైతులు, నేతన్నల జీవితాలతో సీఎం రేవంత్ రెడ్డి ఆటలాడుకుంటున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు.