యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపనలు

రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 28 నియోజకవర్గాల్లో శంకుస్థాపనల కార్యక్రమం. వివిధ జిల్లాల్లో భూమి పూజ చేసిన మంత్రులు

Advertisement
Update:2024-10-11 13:14 IST

కాంగ్రెస్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపనలు జరిగాయి. దసరా పండుగ శుభసందర్భాన్ని పురస్కరించుకుని నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 28 నియోజకవర్గాల్లో మంత్రులు శంకుస్థాపనలు చేస్తుండగా..డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో శంకుస్థాపన చేశారు. బోనకల్‌ మండలం లక్ష్మీపురంలో గురుకుల పాఠశాల నిర్మాణం జరగనున్నది.

మంత్రి పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌లో తిమ్మాపూర్‌ మండలం యాదవులపల్లిలో నిర్మించనున్న గురుకుల పాఠశాలకు శంఖుస్థాపన చేశారు.సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లి సమీకృత పాఠశాలకు భవన నిర్మాణ పనులకు మంత్రి పొన్నం భూమి పూజ చేశారు. ఖమ్మం గ్రామీణ మండలం పొన్నేకల్‌లో నిర్మించనున్నసమీకృత గురుకుల పాఠశాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి , ఎంపీ రఘురామరెడ్డి చేశారు. నల్గొండలోని గంధవారిగూడలో సమీకృత గురుకుల పాఠశాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోన్‌పల్లి సమీకృత గురుకుల పాఠశాలకు మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ వంశీకృష్ణ భూమి పూజచేశారు.

రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల్లో విశాలమైన క్యాంపస్‌లో ఈ స్కూళ్లను నిర్మించాలని సంకల్పించగా, మొదటి విడతలో 28 చోట్ల చేపడుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సామాజిక అంతరాలు లేని విద్యను అందించాలన్న లక్ష్యంతో చేపడుతున్న ఈ క్యాంపస్‌లలో అన్ని రకాలైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేయబోయే ఈ స్కూళ్ల నిర్మాణానికి ప్రభుత్వం దాదాపు 5 వేల కోట్ల రూపాయలు వెచ్చించనున్నది.

Tags:    
Advertisement

Similar News