15 ఏళ్లు అధికారం మనదే.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అంతా సవ్యంగా నడిచిందని గుర్తు చేశారు కేసీఆర్. గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధిని బీఆర్ఎస్ చేసి చూపించిందన్నారు. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో తాగునీరు, కరెంటు, శాంతి భద్రతల సమస్య చూసి బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ జడ్పీ ఛైర్మన్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని జడ్పీ చైర్మన్లను అభినందించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుందన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు వస్తే పిచ్చి పనులు చేసి ప్రజలతో ఛీ కొట్టించుకునే లక్షణం ఉందన్నారు. NTR పాలన తర్వాత ఇలానే జరిగిందని గుర్తుచేశారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అంతా సవ్యంగా నడిచిందని గుర్తు చేశారు కేసీఆర్. గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధిని బీఆర్ఎస్ చేసి చూపించిందన్నారు. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో తాగునీరు, కరెంటు, శాంతి భద్రతల సమస్య చూసి బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పార్టీని వీడుతున్న వారిని చూసి ప్రజలే అసహ్యించుకుంటున్నారన్నారు. పార్టీ నాయకులను సృష్టిస్తుంది కానీ, నాయకులు పార్టీని సృష్టించలేదన్నారు. రాజకీయాల్లో ఉన్నవాళ్లకు సౌజన్యం, గాంభీర్యం ఉండాలన్నారు. గతంలో వైఎస్సార్ తీసుకువచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ పేర్లు మార్చకుండా కొనసాగించామని గుర్తుచేశారు. ఇక ప్రస్తుత ప్రభుత్వం రైతుబంధు పథకానికి పూర్తిగా ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పటివరకు కొంచెం సమన్వయంతో ఉండాలని నేతలకు కేసీఆర్ సూచించారు.
మరో రెండేళ్లలో నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందన్నారు కేసీఆర్. తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 160 వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కొద్దిగా కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక పార్టీ పరంగా అన్ని స్థాయిల్లో కమిటీల ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తామన్నారు. సోషల్‌మీడియాను పటిష్టంగా తయారు చేస్తామన్నారు.