తెలంగాణలో ఏపీని మించి చేపల పెంపకం సాగుతోంది : మంత్రి జగదీశ్ రెడ్డి

గ్రామీణ ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం తిరిగి రావాలని మన సీఎం కేసీఆర్ ఆదేశించారు. దానికి అనుగుణంగా పిల్లలమర్రిలోని సుబ్బ సముద్రంపై మినీ ట్యాంక్‌బండ్ నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Advertisement
Update:2023-06-08 22:06 IST

తెలంగాణ రాష్ట్రంలో మండు వేసవిలో కూడా చెరువులు నీళ్లతో కళకళలాడుతున్నాయి. మిషన్ కాకతీయ పథకం మన చెరువులకు కొత్త వెలుగును ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం సాధించిన గొప్ప విజయాల్లో ఇది ఒకటి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల దినోత్సవం జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి జగదీశ్ రెడ్డి సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి గ్రామంలోని సుబ్బ సముద్రం కట్టపై జరగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

గ్రామీణ ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం తిరిగి రావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దానికి అనుగుణంగా పిల్లలమర్రిలోని సుబ్బ సముద్రంపై మినీ ట్యాంక్‌బండ్ నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రెండేళ్ల వ్యవధిలో సుబ్బ సముద్రాన్ని మంచి నీటికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇప్పటికే మూసీ నదిని మురికి నుంచి సీఎం కేసీఆర్ బయట పడేశారు. త్వరలో సుబ్బ సముద్రంలో కూడా మంచి నీరు ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

మిషన్ కాకతీయ వల్ల చెరువులన్నీ నిండిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అన్ని చెరువులు జలకళను సంతరించుకున్నాయి. అంతే కాకుండా మత్స్యకారులకు ఇప్పుడు ఉపాధి దొరుకుతున్నది. సముద్రతీరం ఉన్న ఏపీ కంటే తెలంగాణ రాష్ట్రమే చేపల పెంపకంలో రికార్డు సృష్టించిందని చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో చేపల సాగు మరింతగా అభివృద్ధి చెందుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రం నీటిపారుదల రంగంలో అసాధారణ విజయాలను నమోదు చేసుకుందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్ణీత వ్యవధిలోనే భారీ ప్రాజెక్టులు నిర్మించి.. జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 50 లక్షల ఎకరాల సాగుభూమి స్థిరీకరణ జరిగిందని అన్నారు.

2014 కంటే ముందు మూసీ ప్రాజెక్టు నీటితో ఏనాడూ రెండు పంటలు పండించిన చరిత్ర లేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుసటి ఏడాదికే రూ.20 కోట్లతో మూసీ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించారని చెప్పారు. దీంతో ఇప్పటి వరకు 16 పంటలకు సమృద్ధిగా నీరు అందిందని జగదీశ్ రెడ్డి చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాధించిన అనేక విజయాలను గుర్తు చేసుకునేందుకే దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇలాంటి విజయాలు అందించిన సీఎం కేసీఆర్‌కు ఈ నేల ఎప్పటికీ రుణపడి ఉంటుందని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు.


Tags:    
Advertisement

Similar News