ఇథనాల్ పరిశ్రమ పనులకు బ్రేక్
స్థానికుల ఆందోళన నేపథ్యంలో పనులు ఆపాల్సిందిగా కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలోని దిలావర్‌పూర్‌లో ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపివేయాల్సిందిగా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమ వద్దంటూ కొన్నిరోజులుగా ఆందోళన చేపడుతున్న గ్రామస్థులతో ఆమె చర్చించారు. మంగళవారం నాటి ఘటనపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు గ్రామస్థులకు తెలిపారు. పరిశ్రమ పనులు నిలిపివేయాల్సిందిగా తాజాగా ఆమె ఆదేశాలు జారీ చేశారు. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ ఇథనాల పరిశ్రమ అనుమతులను ప్రభుత్వం పరిశీలిస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అనుమతులు పునఃసమీక్షించాలని నిర్ణయించింది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు ప్రభుత్వం పరిశీలిస్తున్నది. అవసరమైతే ఇథనాల్ పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది.
అంతకు ముందు నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్మల్-భైంసా హైవేపై స్థానికులు రెండో రోజు ఆందోళన కొనసాగించారు. పురుగుల మందు డబ్బాలతో మహిళలు నిరసనలో పాల్గొన్నారు. కొందరిని ముందస్తు అరెస్టు చేయడంతో పోలీసులపై ఆందోళకారులు దాడి చేశారు. వారి వాహనాలపై రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు పరుగులు తీశారు. ఇథనాల్ పరిశ్రమ అంశాన్ని ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ వచ్చే వరకు తమ నిరసన కొనసాగుతుందని తేల్చిచెప్పారు. ఆయన రాకపోతే ఇక్కడే పురుగుల మందు తాగి చనిపోతామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆందోళనకారులతో చర్చలు జరిపారు.