బీజేపీలో ఒంటరైన ఈటల
బండి సంజయ్‌తో ఈటలకు మొదటినుంచీ గ్యాప్ ఉంటూనే వచ్చింది. అప్పట్లో బండిని తప్పించి ఈటలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ కూడా జోరుగా నడిచింది.
తెలంగాణ బీజేపీలో ఈటల రాజేందర్ ఒంటరైపోయారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. బండి సంజయ్‌తో పొసగకపోవడం, అనుచరుల ఎడబాటు.. ఈటలను ఒంటరిని చేశాయి. గతంలో ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమతో కలిసి బీజేపీలో చేరారు ఈటల రాజేందర్. కానీ, ఇప్పుడు వాళ్లిద్దరూ ఈటలను వదిలి వెళ్లిపోయారు. టిక్కెట్ల కేటాయింపులో అన్యాయం జరగడంతో వాళ్లు బీజేపీకి గుడ్‌బై చెప్పారు.
బీజేపీలో చేరిన కొత్తలో ఉత్సాహంగానే కనిపించిన ఈటల రాజేందర్ ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. పార్టీలో తనకు తగిన గుర్తింపు దక్కడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో ఆయన్ని అధిష్టానం పిలిచి బుజ్జగించింది. చేరికల కమిటీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించింది. వాస్తవానికి ఈటల బీజేపీలో చేరగానే ఆయనపై కమలనాథులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈటల చేరికతో పార్టీలోకి భారీగా వలసలుంటాయని భావించారు. కానీ అలా ఏం జరగలేదు. చేరికల కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఈటల రాజేందర్ కనీసం ఒక్క పెద్ద నాయకుడిని కూడా పార్టీలో చేర్పించలేకపోయారు. ఈ విషయంలో బీజేపీ అధిష్టానం తీవ్ర అసంతృప్తిలో ఉంది.
ఇక బండి సంజయ్‌తో ఈటలకు మొదటినుంచీ గ్యాప్ ఉంటూనే వచ్చింది. అప్పట్లో బండిని తప్పించి ఈటలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ కూడా జోరుగా నడిచింది. బండి, ఈటల మధ్య కోల్డ్ వార్ అభ్యర్థుల ప్రకటనతో తారాస్థాయికి చేరింది. తమవాళ్లకు టిక్కెట్లు ఇప్పించుకుని ఆధిపత్యం ప్రదర్శించేందుకు ఇద్దరు తెగ పోటీపడ్డారు. ఇలా బండి సంజయ్, ఈటల మధ్య ఆధిపత్యపోరు పీక్స్‌కు చేరింది.
తాజాగా ఏనుగు రవీందర్, తుల ఉమ దూరం కావడంతో ఈటల బలం, బలగం తగ్గిందనే వాదన వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గజ్వేల్, హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. అనుచరులిద్దరూ దూరం అవడంతో ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ఈటలకు షాక్ తప్పకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇలా బీజేపీలో ఈటలకు అన్ని ప్రతికూలతలే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీలో ఈటల ఒంటరి పోరాటం ఎంతవరకు అనేది చర్చనీయాంశంగా మారింది.