సినిమాలు, పోలీస్ పాత్రలు.. తెలంగాణ డీజీపీ ఏమన్నారంటే..?
సినిమాల్లో పోలీస్ పాత్రలను ఉదాత్తంగా చూపించాలని, పాజిటివ్ కోణంలో వారి గురించి చెప్పాలన్నారు. కరోనా సమయంలో పోలీసులు 24గంటలు డ్యూటీ చేశారని, తెలంగాణలో 1200 మంది డ్యూటీలో ఉండగా కరోనాబారిన పడ్డారని, 200 మంది సహచరుల్ని కోల్పోయామని చెప్పారు డీజీపీ.
సినిమాల గురించి పోలీస్ బాస్ లు సుదీర్ఘంగా, సాధికారికంగా మాట్లాడతారని ఎవరూ ఊహించి ఉండరు. కానీ తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ మాత్రం తాను యువకుడిగా ఉన్నప్పటి రోజులు గుర్తు చేసుకున్నారు. రాజేష్ ఖన్నా, జీనత్ అమన్, అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర.. ఇలా అందరి సినిమాల గురించి ప్రస్తావించారు. ఆయా సినిమాల్లో పోలీసుల్ని ఎలా చూపించారు, విలన్లను, రౌడీలను ఎలా చూపించారనే విషయాలను చెప్పారు. యువత చెడు మార్గాలవైపు చూడకుండా చేయాల్సిన బాధ్యత సినిమాలపై ఉందన్నారు. ఆనాడు కమర్షియల్ గా హిట్టైన సినిమాల్లో విలన్ పాత్రలు హైలైట్ అయిన విషయాన్ని గుర్తు చేశారు డీజీపీ. కానీ వాటి వల్ల సమాజంలో వచ్చిన మంచిమార్పులేవీ లేవన్నారు.
పోలీసుల్ని పాజిటివ్ కోణంలో చూపించండి..
ప్రస్తుతం సినిమా పరిధి మరింత విస్తృతం అయిందని, హిందీ చిత్ర పరిశ్రమ కంటే తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దగా మారిందని చెప్పారు డీజీపీ అంజనీ కుమార్. తెలుగు సినీ నిర్మాతలు, దర్శకులు తన విన్నపాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. సినిమాల్లో పోలీస్ పాత్రలను ఉదాత్తంగా చూపించాలని, పాజిటివ్ కోణంలో వారి గురించి చెప్పాలన్నారు. కరోనా సమయంలో పోలీసులు 24గంటలు డ్యూటీ చేశారని, తెలంగాణలో 1200 మంది డ్యూటీలో ఉండగా కరోనాబారిన పడ్డారని, 200 మంది సహచరుల్ని కోల్పోయామని చెప్పారు. పోలీసుల త్యాగాలను కూడా సినిమాల్లో చూపించాలన్నారు తెలంగాణ డీజీపీ.
మీడియా యాజ్ ఎ కెటలిస్ట్ ఫర్ సోషల్ ఛేంజ్ అనే పేరుతో జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్ లో డీజీపీ అంజనీ కుమార్ పాల్గొన్నారు. ఆయన ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. సమాజాన్ని జాగృతం చేసే సినిమాలు తీసేందుకు రిస్క్ తీసుకోవాలన్నారు. సమాజాన్ని మేలుకొలిపే శక్తి చిత్రపరిశ్రమకు ఉందన్నారు. సమాజ సేవలో పోలీసులు ఎప్పుడూ ముందుంటారని చెప్పారు అంజనీ కుమార్.