గిరాకీ లేదని ఆటోను తగలబెట్టాడు

మహబూబ్‌ నగర్‌కు చెందిన దేవకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌ వచ్చి మియాపూర్‌లో ఉంటూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

Advertisement
Update:2024-02-02 10:51 IST

అతనో ఆటో డ్రైవర్‌.. ఆటో నడిస్తేనే అతని కుటుంబం గడుస్తుంది. భార్య, ముగ్గురు పిల్లలతో ఉన్న సంసారానికి ఆ ఆటోనే ఆధారం. ఇటీవల కాలంలో ఆటోకు గిరాకీ ఉండటం లేదు. దీంతో చేతిలో డబ్బులు లేక.. కుటుంబం గడిచే మార్గం అర్థంగాక సతమతమవుతున్నాడు. గురువారం సాయంత్రం ఆ బాధలోనే మద్యం తాగి ఆటోని హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌ వద్దకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆటోపై పెట్రోల్‌ చల్లి నిప్పంటించాడు. ఆ మంటల్లో ఆటో దగ్ధమైంది.

పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌ నగర్‌కు చెందిన దేవకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌ వచ్చి మియాపూర్‌లో ఉంటూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల ఆటోకు కిరాయి సరిగా ఉండటం లేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. చివరికి విసిగిపోయిన అతను గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో ప్రజాభవన్‌ వద్దకు ఆటోను తీసుకొచ్చి తగలబెట్టాడు. ఆ తర్వాత మంటల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఆటోపై నీళ్లు పోసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.

గిరాకీ లేక పూటగడవడమే కష్టంగా ఉందని దేవ ఈ సందర్భంగా వాపోయాడు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని, కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఫలితంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని, ఆటో ఎక్కేవారే ఉండటం లేదని తెలుస్తోంది. ఆటో డ్రైవర్లందరూ ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారని పలువురు ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటనేది ప్రభుత్వమే ఆలోచించాలి.

Tags:    
Advertisement

Similar News