తెలంగాణ బీజేపీలో అసమ్మతి సెగలు.. టికెట్ దక్కని నేతల కినుక
ఆదిలాబాద్ టికెట్ తనకు ఇవ్వకుండా పార్టీలో అగ్రనేతలే అడ్డుకున్నారని సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు నిన్న మండిపడ్డారు.
బీజేపీ తొలి జాబితాలో తెలంగాణలో 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. సిట్టింగ్ స్థానాల్లో టికెట్లు దక్కించుకున్న ముగ్గురు ఎంపీల విషయంలో తప్ప దాదాపు మిగిలిన అన్ని స్థానాల్లోనూ అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్, హైదరాబాద్ ఇలా చాలాచోట్ల సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి.
నాకు టికెట్ రాకుండా అగ్రనేతలే అడ్డుకున్నారు
ఆదిలాబాద్ టికెట్ తనకు ఇవ్వకుండా పార్టీలో అగ్రనేతలే అడ్డుకున్నారని సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు నిన్న మండిపడ్డారు. ఆదివాసీనైన తనకు అన్యాయం చేశారని గళమెత్తారు. తనకు టికెటిస్తే గెలిచేస్తానని భయపడ్డారని కామెంట్ చేశారు. ఆదిలాబాద్‌లో నిలిచేది నేనే.. గెలిచేదీ నేనే అన్న బాపూరావు వ్యాఖ్యలు పార్టీ మారతారా అనే విశ్లేషణలకు దారితీశాయి. మరోవైపు హైదరాబాద్ ఎంపీ స్థానంలో నిలబడటానికి మగాళ్లే లేరా అని ఎమ్మెల్యే రాజాసింగ్ కామెంట్ చేశారన్నట్లు సోషల్ మీడియాలో హెరెత్తిపోయింది. హైదరాబాద్ టికెట్‌ను మాధవీలతకు ఇచ్చిన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు నేరుగా పార్టీని వ్యతిరేకించినట్లే.
వలస నేతలకే టికెట్లు ఇచ్చారని ఆరోపణలు
తొలుత ప్రకటించిన 9 స్థానాల్లో ఎక్కువ మంది వలస వచ్చిన నేతలకే టికెట్లిచ్చారని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్, అర్వింద్ తప్ప మిగిలిన వారంతా ఇతర పార్టీల నుంచి వచ్చినవారే కావడం ఈ విమర్శలను నిజం చేస్తోంది. తెలంగాణలో భారీగా సీట్లు గెలవాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి ఇలాంటి అసమ్మతి ఎంతో కొంత దెబ్బ కొడుతుందనడంలో సందేహం లేదు.