మహిళల పేరుతోనే డిజిటల్‌ కార్డులు

అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం

Advertisement
Update:2024-09-28 19:31 IST

ప్రభుత్వం జారీ చేయబోయే డిజిటల్‌ కార్డుల్లో మహిళలే కుటుంబ యజమానుల స్థానంలో ఉండనున్నారు. రేషన్‌, హెల్త్‌, వెల్ఫేర్‌ స్కీముల కోసం జారీ చేయబోయే ఈ డిజిటల్‌ కార్డులో మహిళనే కుటుంబ యజమానిగా గుర్తించాలని, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వివరాలు కార్డు వెనుక భాగంలో ప్రింట్‌ చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సెక్రటేరియట్‌ లో కొత్త కార్డుల జారీ (ఫ్యామిలీ డిజిటల్‌ కార్డులు - ఎఫ్‌డీసీ)పై మంత్రులతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా అధికారుల బృందం ఈనెల 25 నుంచి 27 వరకు రాజస్థాన్‌, హర్యానా, కర్నాటక, మహారాష్ట్రల్లో పర్యటించి అధ్యయనం చేసిన అంశాలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. రేషన్‌, రాజీవ్‌ ఆరోగ్య శ్రీ, ఐటీ, అగ్రికల్చర్‌, ఇతర వెల్ఫేర్‌ స్కీముల డేటా ఆధారంగా కుటుంబాల నిర్దారణ చేయాలని సీఎం సూచించారు. ఇతర రాష్ట్రాల్లో కార్డుల రూపకల్పన, జారీలో ఉన్న సానుకూల అంశాలను స్వీకరించాలన్నారు. బ్యాంక్‌ ఖాతాలు, పాన్‌ కార్డుల లాంటి అనవసర సమాచారం సేకరించాల్సిన అవసరం లేదన్నారు. ఆదివారం సాయంత్రంలోగా కొత్త కార్డుల కోసం చేపట్టాల్సిన సమాచార సేకరణ, కార్డుల్లో ఏయే అంశాలు చేర్చాలి, అప్‌ డేట్‌ కు సంబంధించి వివరాలు ఏమిటి అనే నివదికను కేబినెట్‌ సబ్‌ కమిటీకి సమర్పించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకర్గాల్లో ఒక గ్రామ, ఒక పట్టణాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని సూచించారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో కుటుంబాల నిర్దారణ కోసం ఇప్పటికే ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా అక్టోబర్‌ 3వ తేదీ నుంచి డోర్‌ టు డోర్‌ సర్వే చేయాలన్నారు. ఇందుకోసం నోడల్‌ ఆఫీసర్లను నియమించాలన్నారు. ఎలాంటి లోపాలకు తావివ్వకుండా డోర్‌ టు డోర్‌ సర్వే చేయాలన్నారు. సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, దామోదర రాజనర్సింహా తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News