కాంగ్రెస్‌కు సీపీఎం షాకిచ్చిందా?

పాలేరును వదులుకోవటంలో భాగంగా ఎమ్మెల్సీ సీటును కాంగ్రెస్ ఆఫర్ చేసింది. అయితే సీపీఎం కార్యవర్గ సమావేశం చర్చల్లో అడిగిన సీట్లు ఇవ్వకపోతే పోత్తు కుదరదని తీర్మానం చేసింది.

Advertisement
Update:2023-10-29 13:14 IST

సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ పార్టీకి సీపీఎం పెద్ద షాకిచ్చిందా? తాజాగా సీపీఎం కార్యవర్గ సమావేశంలో జరిగిన తీర్మానం చూసిన తర్వాత ఇదే అనుమానాలు మొదలయ్యాయి. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో వామపక్షాలు కలిసి పోటీ చేయాలని డిసైడ్ అయ్యాయి. సీపీఐ, సీపీఎం పార్టీలకు చెరో రెండు సీట్లు ఇవ్వటానికి కాంగ్రెస్ అధిష్టానం ఓకే చెప్పింది. సీపీఐతో నియోజకవర్గాలు కూడా డిసైడ్ అయిన కారణంగా ఎలాంటి పేచీలేదు.

అయితే సమస్యంతా సీపీఎంతోనో వచ్చింది. సీపీఎం రెండు సీట్లకు అంగీకరించినా మిర్యాలగూడ లేదా వైరా, పాలేరు సీట్లపై పట్టుబట్టింది. మిర్యాలగూడ సీటును ఇవ్వటానికి అంగీకరించిన కాంగ్రెస్ పాలేరు నియోజకవర్గం ఇవ్వడం మాత్రం కుదరదని చెప్పేసింది. పాలేరును వదులుకోవటంలో భాగంగా ఎమ్మెల్సీ సీటును కాంగ్రెస్ ఆఫర్ చేసింది. అయితే సీపీఎం కార్యవర్గ సమావేశం చర్చల్లో అడిగిన సీట్లు ఇవ్వకపోతే పోత్తు కుదరదని తీర్మానం చేసింది.

అంటే పాలేరు నియోజకవర్గాన్ని తమకు కేటాయించకపోతే పొత్తుండదని డిసైడ్ చేసేసింది. ఇక్కడ విషయం ఏమిటంటే పాలేరు నియోజకవర్గంలో పోటీచేసే ఉద్దేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చాలాకాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఎవరితో పొత్తున్నా లేకపోయినా తాను మాత్రం పాలేరులో పోటీచేయటం ఖాయమని ఇఫ్పటికే తమ్మినేని ప్రచారంలో స్పష్టంగా చెప్పారు. అలాంటిది ఇప్పుడు పాలేరును కాంగ్రెస్‌కు వదిలేసి పోటీ నుండి తప్పుకోవటాన్ని తమ్మినేని అవమానంగా భావిస్తున్నారు. ఇదే సమయంలో పాలేరులో పోటీ చేయటాన్ని కాంగ్రెస్‌ కూడా ప్రిస్టేజిగా తీసుకుంది.

ఎందుకంటే పార్టీలో చేరేటప్పుడే పాలేరులో పోటీ విషయమై టికెట్‌ను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ అధిష్టానం దగ్గర హామీ తీసుకున్నారు. జిల్లాలో ఇద్దరూ బలమైన నేతలే కావటంతో పాలేరును ఎవరికి కేటాయించాలో పార్టీకి అర్థంకాలేదు. అయితే వాళ్ళిద్దరు మాట్లాడుకుని తుమ్మల ఖమ్మంలో పోటీచేసేట్లు, పొంగులేటి పాలేరులో పోటీచేసేట్లు ఒప్పందం చేసుకున్నారు. దాంతో పాలేరులో గనుక పొంగులేటి పోటీ చేయకపోతే దాని ప్రభావం జిల్లాలోని మరికొన్ని సీట్లపైన పడటం ఖాయం. అందుకనే కాంగ్రెస్ కూడా పాలేరుపై ఇంతగా పట్టుబడుతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.


Tags:    
Advertisement

Similar News