తెలంగాణలో డెంగీ డేంజర్ బెల్స్..

డెంగీ మరణాలపై మీడియాలో వార్తలు వస్తున్నా.. ప్రభుత్వం గణాంకాలను ఎందుకు ప్రకటించడంలేదని, ఎవరు ఈ లెక్కల్ని తొక్కి పెడుతున్నారని సూటిగా ప్రశ్నించారు కేటీఆర్.

Advertisement
Update: 2024-08-26 03:08 GMT

తెలంగాణలో డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోందని, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన సమయం వచ్చిందని ఆయన చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో డెంగీ మరణాలు లేవని ప్రభుత్వం ప్రకటించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. డెంగీ మరణాలపై మీడియాలో వార్తలు వస్తున్నా.. ప్రభుత్వం గణాంకాలను ఎందుకు ప్రకటించడంలేదని, ఎవరు ఈ లెక్కల్ని తొక్కి పెడుతున్నారని సూటిగా ప్రశ్నించారు కేటీఆర్.


ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేవు..

డెంగీ కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టీ పట్టనట్టు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. సరైన సన్నద్ధత లేదన్నారు. దీనివల్ల ప్రజలకు తీవ్ర అవస్థలు పడుతున్నారని చెప్పారు. మందులు లేక ప్రభుత్వ ఆస్పత్రులకు కూడా జబ్బు చేసిందని విమర్శించారు. ఒక్కోచోట ఒకే మంచంపై ముగ్గురు నలుగురు రోగులు పడుకుని ఉంటున్నారని, ఇలాంటి దారుణ పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవన్నారు కేటీఆర్. డెంగీ పట్ల నిజాలు ఒప్పుకుని, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని తెలంగాణ సీఎస్ ని ఉద్దేశిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు తెలంగాణలో 4648 డెంగీ కేసులు నమోదయ్యాయి. 66వేలకు పైగా శాంపిల్స్ ని వైద్య సిబ్బంది పరీక్షించారని అంటున్నారు. పాజిటివిటీ రేటు 7శాతంగా ఉందని తెలిపారు వైద్యశాఖ అధికారులు. తెలంగాణలోని 10 జిల్లాలను హైరిస్క్ జోన్ లు గా ప్రకటించారు. అత్యథికంగా హైదరాబాద్ లో కేసులు నమోదవుతున్నాయి. ఆ తర్వాత సూర్యాపేట, మేడ్చల్-మల్కాజిగిరి, ఖమ్మంలో కేసులు ఎక్కువ ఉన్నాయి. అయితే డెంగీ మరణాలు లేవని అధికారులు చెప్పడం విశేషం. మరోవైపు ఫీవర్ సర్వే కూడా మొదలు పెట్టినట్టు అధికారులు చెబుతున్నారు. జులై 23నుంచి ఆగస్ట్ 21 వరకు జరిగిన సర్వేలో వైద్య సిబ్బంది 1.27 కోట్ల ఇళ్లను సందర్శించి సర్వే చేపట్టారని, 2.45 లక్షల జనాభాకు వైరల్ ఫీవర్లు ఉన్నట్టు గుర్తించారని అధికారులు తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News