తోలు తీస్తా, రోడ్లపై తిరగనివ్వను.. అసెంబ్లీలో దానం ఘాటు వ్యాఖ్యలు
దానం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగారు. MIM లీడర్ అక్బరుద్దీన్ సైతం దానం వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర దుమారం చెలరేగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనుద్దేశించి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. హైదరాబాద్ అంశంపై మాట్లాడుతుండగా మధ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేయడంతో వారిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు దానం నాగేందర్.
దానం నాగేందర్ ఏమన్నారంటే..
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి బయట తిరగనివ్వ కొడుకా అంటూ వార్నింగ్ ఇచ్చారు దానం. ఏమనుకుంటున్నారు రా మీరు.. నీ అమ్మ అంటూ తీవ్ర పదజాలం ప్రయోగించారు. అక్కడితో ఆగకుండా తోలు తీస్తా ఒక్కొక్కడిది అంటూ హెచ్చరించారు. అయితే దానం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగారు. MIM లీడర్ అక్బరుద్దీన్ సైతం దానం వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తర్వాత తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు దానం. సభకు క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలన్నారు. బీఆర్ఎస్ సభ్యులు ప్రోవోక్ చేయడంతోనే అలా మాట్లాడానని చెప్పుకొచ్చారు. గతంలో ఏనాడూ తను ఇలాంటి మాటలు మాట్లాడలేదన్నారు. తన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన దానం నాగేందర్.. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దానంపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించింది.