జమిలి ముసుగులో దేశాన్ని కబలించే కుట్ర

సీతారాం ఏచూరి సంస్మరణ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి

Advertisement
Update:2024-09-21 16:01 IST

జమిలి ఎన్నికల ముసుగులో బీజేపీ దేశాన్ని కబలించే కుట్ర చేస్తోందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. శనివారం రవీంద్రభారతిలో నిర్వహించిన సీతారాం ఏచూరి సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ.. అలాంటి విధానాలు ఉన్నవాళ్లు దేశంలో ఆదిపత్యం చేయించే కుట్ర చేస్తున్నారని అన్నారు. ఇలాంటి కీలక తరుణంలో సీతారాం ఏచూరి మన మధ్య లేకపోవడం దేశ రాజకీయాల్లో తీరని లోటు అన్నారు. ఆయన ఉంటే రాష్ట్రాల హక్కుల కోసం పాటు పడేవారని అన్నారు. ఆయనలాంటి వాళ్లు రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారని, విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఆయన క్రియాశీల పాత్ర పోషించారని అన్నారు. ఆయన స్ఫూర్తితో జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా పోరాడుతామని తెలిపారు. దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తిని రగిలించి పేదల పక్షాన గళం విప్పిన సీతారాం ఏచూరి మరణం తీరని లోటని అన్నారు. దేశ రాజకీయాల్లో జైపాల్ రెడ్డి సమకాలికుడుగా సీతారాం ఏచూరి ఉండేవారని, నమ్మిన సిద్ధాంతం కోసమే చివరి శ్వాస వరకు నిలబడ్డారని అన్నారు. జీవితాంతం పేదల కోసం పోరాడారని, మరణం తర్వాత కూడా వైద్య విద్యార్థుల పరిశోధనకు ఆయన ఉపయోగపడాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకోవడం ఎంతో గొప్పదన్నారు. యూపీఏ ప్రభుత్వంలో పేదలకు మేలు చేసే ఎన్నో కీలక బిల్లులకు మద్దతు తెలపడానికి ఆయన కృషి చేశారని అన్నారు. రాహుల్‌ గాంధీ ఆయనను మార్గనిర్దేశకుడిగా భావిస్తారని తెలిపారు. రాహుల్‌ గాంధీని ఉద్దేశించి కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు వారి ఫాసిస్టు విధానాలకు అద్దం పడుతున్నాయని, అలాంటి భాషా ప్రయోగం చేసే వారిని ప్రధాని నియంత్రించకపోవడం ప్రజాస్వామ్యానికే మంచిది కాదన్నారు.

Tags:    
Advertisement

Similar News