కాంగ్రెస్ లో చేరు, లేదంటే కేసు.. 100రోజుల పాలన ఇదే..!

కాంగ్రెస్ లో చేరకపోతే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, తాజాగా మధుసూదన్ రెడ్డి విషయంలోకూడా ఇదే జరిగిందని అన్నారు హరీష్ రావు. వందల మంది పోలీసులు తెల్లవారుజామున 3 గంటలకు వెళ్లి అరెస్ట్‌ చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారాయన.

Advertisement
Update:2024-03-15 12:01 IST

కాంగ్రెస్ 100 రోజుల పాలన.. బెదిరింపులు, కక్షసాధింపులకే సరిపోయిందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. మెడపై కత్తి పెట్టి కాంగ్రెస్ లో చేరతావా లేదా అంటూ బీఆర్ఎస్ నాయకుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే మంచి చేసి ప్రజల మనసు గెలవాలని సూచించారు హరీష్ రావు. ప్రతి పక్షం లేకుండా చేయాలనుకోవడం కరెక్ట్ కాదన్నారు. పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి తమ్ముడు మధుసూదన్‌ రెడ్డి అరెస్ట్ ని హరీష్ రావు ఖండించారు. బీఆర్ఎస్ శ్రేణులతో కలసి మధుసూదన్ రెడ్డికి సంఘీభావం ప్రకటించేందుకు వెళ్లారు.


కాంగ్రెస్ లో చేరకపోతే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, తాజాగా మధుసూదన్ రెడ్డి విషయంలోకూడా ఇలాగే జరిగిందని అన్నారు హరీష్ రావు. వందల మంది పోలీసులు తెల్లవారుజామున 3 గంటలకు వెళ్లి అరెస్ట్‌ చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారాయన. అంత అవసరం ఏమొచ్చిందని అన్నారు. నోటీసులు ఇవ్వలేదని, కనీసం ఎఫ్‌ఐఆర్‌ కాపీ కూడా ఇవ్వలేదని చెప్పారు. కాంగ్రెస్ కి అధికారం శాశ్వతం కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. గత పదేళ్లలో తామెప్పుడూ కక్షపూరితంగా వ్యవహరించలేదని చెప్పారు హరీష్ రావు.

మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతోనే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆయన తమ్ముడు మధుసూదన్‌ను టార్గెట్ చేస్తున్నారని అన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ నాయకుల క్వారీల మీద ఎటువంటి చర్యలు ఉండవని, ప్రతిపక్ష నేతలకు చెందిన క్వారీల్లో అన్నీ సక్రమంగానే ఉన్నా కూడా కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని చెప్పారు. 100 రోజుల్లో హామీలు అమలు చేయడం చేతకాని కాంగ్రెస్.. సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోందని ఎద్దేవా చేశారు హరీష్ రావు. చివరకు ధర్మమే గెలుస్తుందని, కోర్టుల ద్వారా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని, బీఆర్ఎస్ నేతలు ధైర్యంగా ఉండాలని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News