కోడ్ వచ్చేలోపు మరో గ్యారెంటీ.. కాంగ్రెస్ వ్యూహం ఖరారు
మిగతా హామీల అమలు ఆలస్యమయినా.. ముందుగా ఆర్థిక సాయం బదిలీ జరిగితే ఎన్నికల్లో కచ్చితంగా తమకు మరింత మేలు జరుగుతుందని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది.
కాంగ్రెస్ 6 గ్యారెంటీల్లో అతి ముఖ్యమైనది 'మహాలక్ష్మి' స్కీమ్. ఇందులో మళ్లీ 3 ప్రత్యేక హామీలున్నాయి. ఇప్పటికే మహిళలకు ఉచిత రవాణా మొదలైంది. మిగిలినవి గ్యాస్ సిలిండర్ రాయితీ, మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఆర్థిక సాయం. ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రజా పాలనతో దరఖాస్తులు తీసుకుంటున్నా.. వాటిలో ముఖ్యమైన హామీని మాత్రం లోక్ సభ ఎన్నికల కోడ్ వచ్చేలోగా అమలు చేయాలని చూస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఈ ఏడాది పార్లమెంట్ తో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ సార్వత్రిక ఎన్నికల ప్రకటన విడుదలై కోడ్ మొదలయ్యే లోపు మరో కీలక హామీని అమలు చేయడానికి కాంగ్రెస్ వ్యూహం రచించింది. మహిళలకు నెల నెలా రూ.2,500 ఆర్థిక సాయం మొదలు పెట్టేందుకు రెడీ అవుతోంది. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాల కసరత్తు మొదలైంది.
ప్రతి మహిళకు ప్రతి నెలా రూ.2,500 ఆర్థిక సాయం చేస్తామనే హామీని అతి త్వరలో అమలు చేయాలని చూస్తోంది కాంగ్రెస్. వీరిలో వృద్ధాప్య, వితంతు పెన్షన్ తీసుకునేవారిని మినహాయిస్తారు. మిగతా మహిళల్లో అర్హులను గుర్తించి వెంటనే పథకం అమలు చేస్తారు. లోక్ సభ ఎన్నికల కోడ్ మొదలయ్యే లోపు కనీసం ఒక నెల ఆర్థిక సాయం అయినా అందేలా చేస్తే ఎన్నికల్లో అది కాంగ్రెస్ కి భారీ మేలు చేకూరుస్తుందనేది ఆ పార్టీ నేతల ఆలోచన.
మరి మిగతా హామీలు..
100 రోజుల డెడ్ లైన్ ఎలాగూ ఉంది. ప్రస్తుతానికి దరఖాస్తులు తీసుకుంటున్నారు. దరఖాస్తుల స్వీకరణ తర్వాత వాటి స్క్రూటినీ.. ఇతరత్రా వ్యవహారాలుంటాయి. అంటే ప్రభుత్వాన్ని నేరుగా ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదు. ఆ పనిమీదే ఉన్నాం.. అని చెప్పే అవకాశం వారికి ఉంది. అయితే లోక్ సభ ఎన్నికలు తరుముకొస్తున్నాయి కాబట్టి కచ్చితంగా ఒక హామీ అయినా అమలు చేస్తే కాంగ్రెస్ పై ప్రజలకు గురి కుదురుతుంది. అది కూడా మహిళలకు మేలు చేసే పథకం అయితే ఆ ప్రభావం మరింత బలంగా ఉంటుంది. అందుకే ఆర్థిక సాయంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. మిగతా హామీల అమలు ఆలస్యమయినా.. ముందుగా ఆర్థిక సాయం బదిలీ జరిగితే ఎన్నికల్లో కచ్చితంగా తమకు మరింత మేలు జరుగుతుందని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది.