నా రాముడి దర్శనానికి పోవడానికి నీ ఇన్విటేషన్ ఎందుకురా..?
"నా పేరే హనుమంతుడు. రాముడికి నా కంటే పెద్ద భక్తుడు ఎవరుంటారు?. నాకంటే సేవ ఎవరు చేస్తారు?. నా రాముడ్ని చూడటానికి నీ ఇన్విటేషన్ కావాలా?.
రామమందిర నిర్మాణాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు. రాముడి మీద బీజేపీకి ప్రేమలేదని.. హిందువుల ఓట్ల మీదే వారికి ప్రేమ అంటూ విమర్శలు చేశారు. రాముడిని రాజకీయాల్లోకి లాగి ఓట్లు సంపాదించాలని బీజేపీ చూస్తోందన్నారు. రామ మందిరానికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదన్న ఆయన అయోధ్యలో కట్టిన రామాలయానికి అందరం వెళ్తామన్నారు. దేవుడి మీద బీజేపీకి మాత్రమే కాదు అందరికీ భక్తి ఉందన్నారు. అయితే ప్రధాని మోడీ పిలిచినప్పుడే అయోధ్యకు వెళ్లాలా..? అని ప్రశ్నించారు. తమకు వీలున్ననప్పుడే అయోధ్య రామాలయ దర్శనానికి వెళ్తామన్నారు వీహెచ్.
రాముడి దగ్గరికి వెళ్లడానికి ఇన్విటేషన్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు వీహెచ్. "నా పేరే హనుమంతుడు. రాముడికి నా కంటే పెద్ద భక్తుడు ఎవరుంటారు?. నాకంటే సేవ ఎవరు చేస్తారు?. నా రాముడ్ని చూడటానికి నీ ఇన్విటేషన్ కావాలా?. బీజేపీ వాళ్లు పిలిచినప్పుడు వెళ్లకపోతే దేవుడి భక్తి లేనట్లా?, ధర్మాన్ని పాటించనట్లా?. దేవుడంటే భక్తి అందరికి ఉంది. మీరు పిలిచినప్పుడు రాకపోతే మేం రాముడి వ్యతిరేకులం అవుతామా?". కాంగ్రెస్‌పై బీజేపీ దుష్ఫ్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వీహెచ్.
"25 కోట్ల మంది పేదలను ధనికులకు చేశానని మోడీ చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. ఇంతకంటే మించిన అబద్ధం మరొకటి లేదు. మోడీ సర్కారు కార్పొరేట్ సెక్టార్‌కే లాభం చేస్తోంది. రైతులకు మద్దతు ధర పెంచాలని అడిగితే ఇప్పటికీ లేదు. నోట్లరద్దు పేరుతో చిన్నచిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళను రోడ్డున పడేశారు". అని మోడీ సర్కారుపై విమర్శలు గుప్పించారు వీహెచ్.